ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చొరవతో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రానున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం నగరం ఐటీ, గ్లోబల్ కంపెనీల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జులై 17న జరిగిన 9వ ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో రూ.20,216 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 50,600 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. ఇందులో నాలుగు ప్రముఖ ప్రాజెక్టులు ప్రధాన భాగం కాగా, ఈ విజయానికి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలే మూలకారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో సంస్థల విశాఖ చేరిక
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేష్ బెంగళూరు, దావోస్‌లలో పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపారు. ఆ ఫలితంగా ప్రముఖ సంస్థలు సత్వ డెవలపర్స్ (రూ.1500 కోట్లు – 25 వేల ఉద్యోగాలు), ఏఎన్ఎస్ఆర్ (రూ.1000 కోట్లు – 10 వేల ఉద్యోగాలు) తో ఒప్పందాలు కుదిరాయి. అలాగే సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ కంపెనీ విశాఖలో రూ.1,466 కోట్లతో డేటా సెంటర్ ప్రారంభించనుంది. రెండో దశలో మరో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వీటితోపాటు బీవీఎం ఎనర్జీ సంస్థ ఎండాడలో రూ.1250 కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. దీనివల్ల మరో 15 వేల ఉద్యోగాలు కల్పించనున్నారు.
వైజాగ్‌ను ఐటీ హబ్‌గా మార్చే దిశగా దూసుకుపోతున్న లోకేష్
టీసీఎస్ (12 వేల ఉద్యోగాలు), కాగ్నిజెంట్ (రూ.1583 కోట్లు – 8 వేల ఉద్యోగాలు) వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. లోకేష్ చేపట్టిన పెట్టుబడుల యాత్రలు, వేదికలపై జరిగిన చర్చలు ఆశించిన ఫలితాలిస్తోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 95 గ్లోబల్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలవుతుందన్న నమ్మకాన్ని లోకేష్ వినిపిస్తున్నారు. ఉద్యోగాలు, పెట్టుబడుల కలయికతో వైజాగ్ నగరం నూతన రూపాన్ని సంతరించుకోనుంది.
Read Also : Jewellery Shop : టాయ్ గన్‌తో బెదిరించి జ్యువెలరీ షాపులో దోపిడీ
.