తెలంగాణలో గురుకుల విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటనలు కలకలం రేపుతున్న వేళ, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, నాగర్ కర్నూల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గురుకుల పాఠశాలల్లో 48 గంటల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రిలో చేరినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
గురుకులాల పై దాడి చారిత్రక నేరం – హరీశ్ రావు ఆరోపణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ గురుకులాల వ్యవస్థను నీరసపరిచేందుకు సంకుచిత లక్ష్యాలతో పనిచేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ కాలంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన గురుకులాల ఖ్యాతిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్షీణింపజేస్తోందని అన్నారు. “తానే మానిటరింగ్ చేస్తానంటూ బీరాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థుల ప్రాణాలు కోల్పోతున్నా స్పందించకపోవడం హేయమని అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం – వెంటనే చర్యలు తీసుకోవాలి
గత 20 నెలల్లో పాము కాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్లతో 100కిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉన్నదని హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర పరిపాలనకంటే ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఉందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను సకాలంలో పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ తరఫున వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also : Bangladesh F-7 Tragedy : బంగ్లాదేశ్ లో కుప్పకూలిన ఫైటర్ జెట్