తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) ముఖ్యమైన సమాచారం అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్లు రేపు, అంటే జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయని ప్రకటించింది. ఇందులో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను తిలకించాలనుకునే భక్తులు ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
అంగప్రదక్షిణ టోకెన్లు జులై 23న విడుదల
భక్తుల సౌకర్యార్థం టీటీడీ వేరుగా అంగప్రదక్షిణ టోకెన్లను జులై 23న విడుదల చేయనుంది. తిరుమలలో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో అంగప్రదక్షిణ చేసేందుకు టోకెన్లు అవసరం కావడంతో, భక్తులు తప్పక ముందుగానే వాటిని బుక్ చేసుకోవాలి. ఆన్లైన్‌లో లభించే ఈ టోకెన్లకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు జూలై 24న విడుదల
అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (రూ.300 టికెట్లు) జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లతో భక్తులు వేగంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు వంటి పలు ముఖ్య ఉత్సవాలు జరగనుండటంతో, ఈ టికెట్లకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అందువల్ల భక్తులు ముందుగానే సాంకేతికంగా సన్నద్ధం అయ్యి, నిర్ణీత సమయంలో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.
Read Also : Bangladesh F-7 Tragedy : బంగ్లాదేశ్ లో కుప్పకూలిన ఫైటర్ జెట్