తెలంగాణలోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh ) తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బోనాల సందర్భంగా లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. “బీజేపీ రిజైన్ చేయమంటే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాను. గోషామహల్లో ఉపఎన్నిక వస్తే కూడా నాకు అభ్యంతరం లేదు. ఎవరు పోటీ చేసినా నాకు అంతగా బాధ లేదు,” అంటూ తాను పదవికి అతుక్కుపోనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు
తాను మరో పార్టీలోకి వెళ్లబోవడం లేదని, ముఖ్యంగా AIMIMతో మిత్రత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదని రాజాసింగ్ ఖండితంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా బీజేపీతో రాజాసింగ్‌కు అభిప్రాయ భేదాలు ఉన్న విషయం తెలిసిందే. పార్టీ చర్యలపై అసంతృప్తితో ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. కానీ పార్టీ మారడంపై వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో పూర్తిస్థాయిలో తెర పడినట్లు కనబడుతోంది.
భవిష్యత్ కార్యచరణపై స్పష్టత
రాజాసింగ్ తన రాజకీయ ఆస్తిత్వాన్ని ప్రజాసేవ ద్వారా కొనసాగిస్తానని, పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తానని అన్నారు. పార్టీ నాయకత్వం సూచిస్తే పదవి మానడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో, ఆయన పార్టీ పట్ల ఉన్న విశ్వాసం ఇంకా నిలిచినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై రాజాసింగ్ ఏ నిర్ణయం తీసుకుంటారో రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Read Also : Dharmasthala Mystery : ధర్మస్థల మిస్టరీ హత్యలపై సిట్ ఏర్పాటు