తెలంగాణలో వర్షాలు (Rains) ఊహించని విధంగా కురుస్తున్నాయి. హైదరాబాదులో వరుసగా రెండో రోజు శనివారం కూడా వర్షం కురుస్తోంది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లు, ఫ్లైఓవర్లు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుంచి బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, మారేడుపల్లి వంటి ప్రాంతాల్లో మళ్లీ వర్షం ప్రారంభమైంది.
వర్ష సూచనలపై అధికారుల హెచ్చరికలు
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని GHMC అధికారులు సూచించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, శనివారం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
మరిన్ని జిల్లాల్లో వర్ష సూచన, ప్రజలకు హెచ్చరిక
మిగిలిన జిల్లాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతేనే ఇంటి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే, ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also : Chandrababu : 2019 ఎన్నికల ముందు నేను మోసపోయాను : చంద్రబాబు