
ఒక్క మాట వినెళ్లు.. ఇంకెవరికి చెప్పనూ!
నన్ను నీతో పట్టుకెళ్లిపోయాక నన్ను
నాలో వదిలేసెళ్లాక నేను
నాకు లేకుండా పోయాక
శూన్యమై పోయాను.
అయినా../ నువిచ్చిన ఆలోచన
తట్టుకుని నిలబడే ఓర్పునిచ్చింది
నిన్ను చూస్తూ పెరిగిన నా ధైర్యం
ఎన్ని ఆటంకాలు ఎదురైనా
పోరాటం ఆపకంది. చివరి
వరకూ ఎవరికి ఎవరూ మిగలరు
ఎవరికి ఎవరూ ఉండరనే సత్యం
ఎంత తెలిసినా../ ఉన్న అన్ని జ్ఞాపకాల్లో
నాకు నేను లేకుండా పోయాను.
కళ్లనుండీ సముద్రం పోటెత్తినా
తెరపిన పడేదాన్ని. గుండెల్లో పేరుకున్న
దుఃఖతుఫాన్ ఉప్పెనగా మారి నన్ను
ముంచేసినా కోలుకునేదాన్ని.
నీ విలువల్ని పుణికి పుచ్చుకుని
నన్ను నీ దగ్గర వొదిలేసుకున్నందుకేమో
కాలాలు కొనసాగుతున్నాయ్
నేను నీ దగ్గర ఆగిపోయా!
కప్పలన్నీ నీ చెరువులోకి చేరితే
అన్నీ తెలిసీ నువ్వూరుకున్నావ్
ఏరు దాటాక తెప్ప
తగలలేస్తారని గ్రహించక
నా అనే మైకంలో..
నేనూ కళ్ల మూసుకునున్నా.
వెన్ను తట్టేందుకు నా వెనుక
నువ్వున్నావనే ధైర్యం
పెదవి మీద ప్రవహిస్తూ ఉంటుంది
నిన్ను దోచుకున్న తోడేళ్లకూ
నన్ను ముంచి గుంటనక్కలకూ
జ్ఞానోదయం ఎన్నటికీ కలగదు.
వాళ్ల భుజాల్ని వాళ్లు తడుముకుంటూ
నా గుండెలకేసి గునపాల్ని విసిరేస్తూ
అమాయకుల్లా ఇంకా మొహానికి
మేకతోలు తొడుగేసుకు తిరగాడుతున్నారు.
పగలు ఉంది ప్రతీ ఉదయం
సూర్యుడు రాకపోవచ్చు.
రాత్రి ఉంది ప్రతీ రాత్రీ
చంద్రుడు కనిపించకపోవచ్చు
నా హృదయంలో ఏ వేళలోనూ ఎప్పటికీ..
వాళ్లు ఉదయించలేరనే అసలు సత్యం
నా పెదవిపై పున్నమి వెలుగై పూసింది