हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

Air Pollution : ఊపిరికి ఉరికాలుష్యం

venkatesh
Air Pollution : ఊపిరికి ఉరికాలుష్యం

Air Pollution : ఒకప్పుడు ఈ భూ ప్రపంచం పర్యావరణం కాలుష్యరహితంగా ఉండేవి. మదికి హాయిగొలిపే చల్లని గాలులతో, ఆహ్లాదకరమైన సహజసిద్ధమైన వాతావరణంలో, చక్కని పండువెన్నెలలో ఆరు బయట అందరూ కబుర్లు చెప్పుకుంటూ నిదురించిన అలనాటి కాలం గతించింది.

పెద్దలు చెప్పే కథలు వింటూ ప్రశాంతంగా నిద్దురలోకి జారిపోయి, వేకువజామున కోడికూతతో నిద్రమత్తు వదిలించుకుని, రెట్టించిన ఉత్సాహంతో పగలంతా పనిపాటలు చేసుకుంటూ శ్రమైక జీవన సమిష్టితత్వంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న మానసిక సౌందర్యంతో అరమరికలు లేని స్వచ్ఛమైన మనసులతో ఆరోగ్యంగా శత వసంతాలు జీవించి, పరిపూర్ణమైన సంతృప్తితో ఆనందమయ జీవితం గడిపి హాయిగా తనువు చాలించిన నాటి రోజులు నేడు కరువయ్యాయి.

Air Pollution

పక్షుల కిలకిల రావాలతో, పచ్చి బయళ్లలో చెంగున ఎగిరే లేగదూడల గంతులతో, పాలిచ్చే గోవులు తమ అందమైన దూడలను తమ నోటి స్పర్శతో ఆత్మీయంగా అపురూపంగా తాకుతూ, ప్రకృతి శోభను ఇనుమడించే అపురూప దృశ్యాలు, సూర్యోదయపు కాంతులు చెట్ల చిగురాలకుపై నున్న మంచు బిందువులను తాకి మిలమిల మెరుస్తూ, ప్రకృతి అందచందాలను ద్విగుణీకృతం చేసే కమనీయ దృశ్యాలను వీక్షించే అదృష్టానికి, ఆసక్తికి ఆస్వాదనకు వర్తమాన తరం బహు దూరంలో ఉంది.

ప్రకృతి ఆరాధన తెలియని రోజులొచ్చాయి. ప్రకృతి పట్ల పూజ్య భావం నశించింది. పుడమి గర్బాన్ని చీల్చి, సహజ వనరులను వెలికితీసి, విచ్చలవిడిగా వినియోగిస్తూ, కాలుష్యాన్ని పెంచేస్తూ, పర్యావరణాన్ని నాశనం చేసి, రాబోయే తరాలకు శాపగ్రస్తమైన జీవితాలను అందించడం భావ్యమా?

పర్యావరణాన్ని మనం చేజేతులా నాశనం చేస్తున్నాం. తత్ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నాం. భౌగోళిక స్థితిగతులను బట్టి, పర్యావరణ సంబంధమైన మౌలిక పరిశీలనను బట్టి ఏయే కాలాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో కూలంకషంగా అధ్యయనం చేసి కాల విభజన చేయడం జరిగింది. ఆయా మాసాల్లో వచ్చే ఋతువుల్లో వాతావరణ మార్పులు మన పెద్దలు చెప్పిన ప్రకారంగా తూచా తప్పకుండా జరిగేవి. ఖగోళ శాపాన్ని భూగోళ పరిస్థితులను సమన్వయపరచి, తమ శాస్త్ర విజ్ఞానాన్ని రంగరించి ఏయే ఋతువుల్లో ఏయే మార్పులు సంభవిస్తాయి? ఏ కాలంలో భూతలంపై ఎలాంటి శీతోష్ణ స్థితులు సంతరించుకుంటాయో తెలిపే పంచాంగంలోని విషయాలు యథాతథంగా జరిగేవి. ఏయే మాసాల్లో ఎండలు ఉంటాయి? ఏ కాలంలో చలి పెరుగుతుంది? ఏయే కాలాల్లో వర్షాల ఆగమనం జరుగుతుంది? కార్తెల ప్రభావం ఎలా విషయాలపై మన పెద్దలు చెప్పిన విషయాలు వివిధ వర్గాల ప్రజలకు మార్గ నిర్దేశనం చేసేవి.(Air Pollution)

అయితే నేడు ఆ పరిస్థితులు మారిపోయాయి. మనుషులు మారతారు. కాలాలు, ఋతువులు మారబోవని మన పెద్దలు చెప్పిన మాటలు వర్తమానంలో ఎదురు తిరిగాయి. మనుషులతో పాటుగా కాలాలు కూడా మారిపోయాయి. ఋతువుల ధర్మం మారిపోయింది. కార్తెలు కూడా తమ గమనాన్ని మార్చుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కాలం నాటి అంచనాలు తలకిందులవుతున్నాయి.

ఒకప్పటి పచ్చని ప్రకృతి, పర్యావరణం మానవ దుష్కార్యాలతో విధ్వంసం కాబడింది. గలగల పారే సెలయేర్లు, నిండు కుండలా జలసిరులతో తులతూగే నదీనదాలు, ఎత్తైన కొండలు, అరణ్యాలు, అరణ్యాల్లో జీవించే పశుపక్ష్యాదులు, అపారమైన భూగర్భ జల సంపద, భూగర్భంలో నిక్షిప్తమైన అమూల్యమైన పలు వనరులు, సకల జీవరాశుల ఉనికికి ఆవాసంగా మారిన పుడమి ప్రకృతి ప్రసాదించిన అందచందాలతో సృష్టి అలంకారంలా భాసిస్తూ, అలరారిన నాటి సోయగం నేడు అదృశ్యమై నిస్సారమై ఎడారిని తలపిస్తున్నది.

కొండల్లో, కోనల్లో, అడవుల్లో ఎక్కడ చూసినా ప్రకృతి సోయగం గుబాళించేది. ఎన్నో రకాల వృక్షాలు ప్రకృతిలో పచ్చదనాన్ని సృష్టికి కానుకగా అందించేవి. అలాంటి పచ్చదనం నేడు కనుమరుగైంది. సంగీత రస ఝరిలా పృథ్విపై ప్రవహించే జల రాశులు మటుమాయమైపోతున్నాయి. భూగర్భ వనరులన్నీ తరిగిపోతూ నిండు గర్భిణిలా కనిపించే భూమాత శోకదేవతలా తల్లడిల్లిపోతున్నది. అరణ్యాలు అంతరించిపోతున్నాయి. కోటానుకోట్ల జీవరాశులకు నిలయమైన అవనిపై మానవాధిపత్యం పెరిగింది. క్షీణిస్తోన్న పచ్చదనం ప్రకృతిలో పచ్చదనం హరించుకుపోతున్నది. పుడమి బోసిపోతున్నది. ఎన్నో జీవరాశులు అంతరించిపోయాయి. మరెన్నో జీవజాతుల ఉనికి ప్రశ్నార్థకమైపోయింది. పర్యావరణం ప్రమాదంలో పడింది.

ఈ సమస్త సృష్టి ఒక మహా విస్ఫోటనం వలన జరిగిందని శాస్త్రవేత్తల భావన. ‘బిగ్ బ్యాంగ్ థియరీ‘(The Big Bang Theory)ని భూగోళం ఏర్పడడానికి గల కారణాలను సోదాహరణంగా విశదీకరిస్తున్నది. భూమి ఏర్పడిన తర్వాత నీరు ఏర్పడిందని, ఆ తర్వాత జీవజాలం ఉద్భవించిందని పలువురి వాదన. అయితే భూగ్రహం ఏర్పడడానికి గల కారణాలు ఈనాటికీ ఒక రహస్యంగానే ఉన్న మాట నిజం. ఎవరెన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా విశ్లేషించినా భూగోళం ఆవిర్భావానికి కొన్ని ఊహలతో, ప్రయోగాలతో, పరిశోధనలతో కూడిన విశ్లేషణలు పూర్తి స్థాయి ఆధారాలను కనుగొనలేకపోయిన మాట వాస్తవం. భగవంతుడే సృష్టికి మూలమని మరికొందరి నమ్మకం.

శాస్త్రీయమైన దృక్పథమే మనం నివసిస్తున్న భూగ్రహం చరిత్రను ప్రస్ఫుటం చేస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సర్వ జీవరాశుల మనుగడకు ప్రస్తుతమున్న ఏకైక ఆధారం భూమి. ఈ భూగోళం అనేక సజీవ, నిర్జీవ పదార్థాల సమ్మేళనం. భౌతిక, రసాయనిక సమ్మేళనాలతో మిళితమై ఉన్న భూగ్రహం అన్ని గ్రహాల కంటే మిన్న. మనం నివసించే భూమి, గాలి, నీరు, నీటి సమూహాలైన నదులు, సముద్రాలతో నిండి ఉన్నది. కొండలు, లోయలు, అరణ్యాలు తదితరాలతో ఏర్పడిన మనం చుట్టూ ఉన్న ప్రకృతి పలు సహజసిద్ధమైన ఏర్పాట్లకు నిలయం.

ఆహ్లాదకరమైన వాతావరణం, జీవించడానికి వీలైన పరిస్థితులతో భూగోళం ఒక జీవ గ్రహంగా భావించబడుతున్నది. ఇతర గ్రహాల్లో లేని అనుకూలమైన పరిస్థితులు భూమిపై ఏర్పాటు చేయబడ్డాయి. సకల జీవరాశుల మనుగడకు ఆధారమైన అన్ని సదుపాయాలు భూగ్రహంపై ఉన్నాయి. జీవరాశుల మనుగడకు ఎన్నో అవసరాలుంటాయి. అయితే ఇవన్నీ సహజసిద్ధంగా ప్రకృతిలోనే ఏర్పటు చేయబడ్డాయి. గాలి, నీరు వంటి అత్యవసరాలతో పాటుగా అనేక సజీవ, నిర్జీవ వ్యవస్థలను మన ప్రకృతి మనకు అందించింది.

ఎన్నో ప్రకృతిసిద్ధమైన భౌతిక, రసాయనిక వ్యవస్థలు, జీవమున్న, జీవం లేని పదార్థాలు మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. మన చుట్టూ ఆవరించబడిన సహజమైన ఈ అద్భుతమైన ఏర్పాటునే ‘పర్యావరణం’ అని క్లుప్తంగా నిర్వచించవచ్చు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ నిర్వచనం ప్రకారం మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశులు ఈ ప్రకృతిలో కలసి మెలసి జీవించే ఒక భౌగోళిక ప్రాంతాన్ని ‘ఎకోసిస్టమ్’ అంటారు.

Air Pollution

వివిధ రకాల జీవ, నిర్జీవ కారకాలతో మన చుట్టూ ఆవరించబడి, మన జీవితాన్ని ప్రభావితం చేసే పర్యావరణాన్ని గురించి, దాని పరిరక్షణ ఆవశ్యకత గురించి సమగ్రంగా విశ్లేషించుకుని, పర్యావరణ సంరక్షణకు చేపట్టవలసిన ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ గురించి చర్చించడం వలన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సార్థకత చేకూరుతుంది.

గాలి, నీరు, మానవ కోటికి అత్యంత ఆవశ్యకాలు. అలాంటి గాలి, నీరు కలుషితమైపోయి, అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. గాలిలో నాణ్యత తరిగింది. విష వాయువులను పీల్చి, రసాయనాలతో నిండిన ఆహార పదార్థాలను భుజించి, సహజసిద్ధమైన వాతావరణాన్ని నాశనం చేసి, కృత్రిమమైన అలవాట్లకు లోనైన మానవ జీవితం అస్తవ్యస్తంగా మారింది.

Air Pollution : కాలుష్యమనే సాలెగూడు లాంటి ప్రపంచంలో అంటురోగాలతో నిరంతరం చస్తూ, బతుకుతూ అతలాకుతలమౌతున్న మానవాళి ఇలా ఎన్నాళ్లు మనుగడ సాగించగలదు? ప్రభుత్వాలు, ప్రజలు, అంతర్జాతీయ సంస్థలు ఎందుకు ఈ విషయంలో ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నాయి? పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ నిషేధం ఎందుకు సాధ్యం కావడం లేదు?

ప్రపంచంలో ప్రతీ ఏటా 400 మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతున్నది. ఇందులో సగం ప్లాస్టిక్ కేవలం ఒకే ఒక్కసారి వినియోగం(సింగిల్ యూజ్) కోసం తయారు చేయబడుతున్నది. ప్లాస్టిక్ వ్యర్థాల వలన పర్యావరణానికి ఏర్పడుతున్న ముప్పును ఎందుకు ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించడం లేదు?

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతులిచ్చేదెవరు? రసాయనాల తయారీకి లైసెన్సులు మంజూరు చేసేదెవరు? ప్లాస్టిక్ ఉత్పత్తులకు అనుమతులిస్తున్నదెవరు? వాతావరణ కాలుష్యానికి బాధ్యత ఎవరు? నగరాలు మురికి కూపాలుగా మార్చమని కోరిందెవరు? భూతాపం పెరగడానికి బాధ్యులెవరు?(Air Pollution)

వీటన్నింటికీ ప్రజలు ప్రత్యక్ష కారణం కాదు. పలు దేశాలు తమ వ్యాపార సౌధాలు నిర్మించుకోవడానికి ఇతర దేశాలపై తమ అభిప్రాయాలను, ప్రణాళికలను బలవంతంగా రుద్దే ప్రయత్నంలో ప్రజలను పావులుగా మారుస్తున్నాయి. అధిక దిగుబడుల కోసం రసాయనాలను, పురుగు మందుల వాడకాన్ని ప్రోత్సహించిందెవరు? ప్రజలా? రైతులా? వినియోగదారులా? వీరెవరూ కారణం కాదు. ప్రజలను కాలుష్యపు రొంపిలోకి దించి, పనికిమాలిన ఉత్పత్తులకు అనుమతులిప్పించి, ప్రతీ విషయాన్ని ప్రజలదే తప్పు అన్నట్టుగా మాట్లాడడం సబబు కాదు.

అన్ని దేశాలు అభివృద్ధి పేరుతో, వ్యాపారం పేరుతో పలు రకాల వస్తువులను ప్రజలపై ఆకర్షణీయమైన పద్ధతిలో చొప్పించి, తీరా వాటి వలన దుష్పరిణామాలు ఏర్పడేసరికి ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరడం భావ్యమా? తర్వాత తీరిగ్గా పర్యావరణంపై అవగాహన కలిగించాలని కోరడం న్యాయమా? ఈ తప్పెవరిది? శిక్షెవరికి?

శతాబ్దాల కిందట అత్యంత సౌకర్యవంతంగా, పచ్చదనంతో, పలు జీవరాశుల ఉనికితో, కాలుష్యం లేని చక్కని వాతావరణంతో ఆహ్లాదకరంగా అగుపించిన ధరిత్రి ఇప్పుడు పర్యావరణ విధ్వంసం వలన ఏర్పడిన కాలుష్యంతో కళతప్పి, పచ్చదనం కోల్పోయింది. అనేక జీవరాశుల అంతర్ధానానికి పర్యావరణంలో చోటు చేసుకుంటున్న తీవ్రమైన పరిణామాలే కారణం. మానవ స్వార్థం పడగ విప్పి బుసలు కొడుతున్నది. భూగోళం నిర్జీవమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. మన కంటిని మన వేలితోనే పొడుచుకునే దుర్దినాలు దాపురిస్తున్నాయి.

ఒకానొక మహా విస్ఫోటనంలో ఉద్భవించినట్టుగా భావిస్తున్న ఈ మహా విశ్వంలో భూమండలం ఒక మహా అద్భుతం. ఇలాంటి భూమిని కలుషితాలతో నింపి కాటికి పోయే కాలాన్ని చేజేతులా కొనితెచ్చుకోవడం మహా అజ్ఞానం. సకల జీవరాశులకు నివాసయోగ్యమైన ‘ధరిత్రి’ని సంరక్షించుకోవడంలో నేటికీ సరైన కార్యాచరణ లేదు. చెప్పడానికి, రాయడానికి మాత్రమే మన ఆలోనా పరిధి పరిమితమైపోయింది. ఆచరణ అటకెక్కింది.

Air Pollution

భూమిని గురించి, భూ సంరక్షణ గురించి ఆలోచించి, తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి ప్రజాభిమానం చూరగొంటున్న ప్రకృతి ప్రేమికులను, పర్యావరణ పరిరక్షకులను గుర్తించి గౌరవించాలి. అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ప్రకృతి ప్రేమికుడై, పచ్చదనం కోసం పరిశ్రమించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, అరణ్యాన్నే సృష్టించి మానవాళికే కాకుండా ఎన్నో జీవరాశుల ఉనికికి ప్రాణం పోసిన జాదవ్ పాయెంగ్ ‘ఫారెస్ట్ మేన్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపబడి, ఎన్నో అవార్డులను గెలుచుకుని ఎంతోమంది పర్యావరణ ప్రేమికులకు ఆదర్శంగా నిలిచాడు.

Air Pollution : తెలంగాణకు చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో మొక్కలను పెంచి, ప్రకృతికి కానుకగా అందించి, ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్నాడు. ఇలా ఎంతో మంది పర్యావరణ ప్రేమికులు పచ్చదనాన్ని పెంచి, ధరిత్రిని కాపాడడానికి కృషి చేస్తున్నారు.

ఎన్నో అద్భుతాలు, ఎన్నో సహజసిద్ధమైన అందచందాలు, మనసును మైమరపించే కమనీయ ప్రకృతి దృశ్యాలు ధరిత్రికి అత్యంత శోభను సమకూర్చిపెట్టాయి. మానవ జీవన సౌందర్యం మసకబారే రోజులు ఏర్పడుతున్నాయి. మానవ స్వార్థం మానవాళికే మృత్యుగీతం ఆలపించే తరుణం ఆసన్నమైనది.

పచ్చని ప్రకృతి ఒడిలో పసిపిల్లలవలె ఆనందంతో జీవించే ఆరోగ్యవంతమైన వాతావరణం భూమిపై కనుమరుగైపోతుంటే, సహజత్వంలో ఉన్న మాధుర్యాన్ని మరచి, కృత్రిమంగా జీవించే కాలాన్ని ఖరీదు పెట్టి కొనుక్కునే చేటు కాలం దాపురించింది. పండువెన్నెల్లో పరవశించే కాలం పరిసమాప్తమై, కాంక్రీటు అరణ్యాల పరదాల్లో నివసిస్తున్నాం.

జీవరాశుల మనుగడకు గ్రీన్ హౌస్ వాయువులు ఎంత ముఖ్యమో, వీటి ప్రభావం అధికమైతే అంతే ప్రమాదం. గ్రీన్ హౌస్ వాయువులు లేకపోతే భూతల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీకి పడిపోతాయి. కాబట్టి ఈ వాయువులు తగిన పరిమాణంలో ఉండాలి. కాలుష్యాన్ని పెంచే ఇంధనాల వాడకం విపరీతంగా పెరిగిపోతున్నది. మానవ దుశ్చర్యల వలన ప్రకృతి ప్రకోపిస్తున్నది. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. కలుషిత కారకాలతో, అవాంఛనీయ వాతావరణ మార్పులతో ధరిత్రిలో జీవజాలం నశించి, భూగ్రహం నిర్జీవంగా మారే ప్రమాదం ఏర్పడింది.

పచ్చదనాన్ని పెంపొందించి, జీవ వైవిధ్యాన్ని కాపాడి, ప్రకృతిని పరిరక్షించి, ‘ధరిత్రి’ని కాపాడుకోవడానికి గల అన్ని అవకాశాలను పరిశీలించాలి. ప్రకృతిలో పచ్చదనానికి ప్రాధాన్యతనివ్వాలి. మొక్కలను విరివిగా పెంచాలి. కాలుష్య రహిత ప్రపంచానికి పచ్చదనమే మార్గం. పచ్చదనాన్ని కాపాడితే వాతావరణంలో సంభవించే అవాంఛనీయ మార్పులను అరికట్టవచ్చు. కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలంటే పచ్చదనమే ఏకైక మార్గం.

సకల దుర్గంధాలతో మిళితమైన ప్రస్తుత వాతావరణాన్ని మార్చగలమా? మానవ తప్పిదాలను సరిదిద్దుకోగలమా? సహజ జీవన శైలిని అలవరచుకోవడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు జవాబేది?

పర్యావరణ దినోత్సవం

Air Pollution : పర్యావరణానికి ఏర్పడుతున్న ముప్పును గమనించి, 1972వ సంవత్సరంలో స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో జరిగిన ఒక సదస్సులో పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి, ఐక్యరాజ్యసమితి ప్రతీ ఏటా జూన్ 5వ తేదీన “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” జరపాలని నిర్ణయించింది. 1973వ సంవత్సరంలో జెనీవాలో మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిగింది.

పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం, పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతే జరిగే అనర్థాల గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం, పర్యావరణ విధ్వంసాన్ని నిలుపుదల చేసి, కాలుష్యాన్ని అరికట్టి భావితరాలను కాపాడడం ‘యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్ ప్రోగ్రామ్’ (యుఎన్ ఇపి) లక్ష్యం.

ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి పశ్చిమ ఆఫ్రికాలోని ‘కోటె ది ఐవొరె’ అనే దేశం (ఐవరీ కోస్ట్) ఆథ్యమిస్తున్నది. నెదర్లాండ్ భాగస్వామ్యంతో ఈ సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ 50వ వార్షికోత్సవ సందర్భంగా తీసుకునే నిర్ణయాల వలన పర్యావరణానికి మేలు జరగాలి. అలాగే ప్లాస్టిక్ వినియోగం వలన ఏర్పడుతున్న పర్యావరణ ముప్పును నివారించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ‘సొల్యూషన్స్ ఫర్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అనే థీమ్ ఆధారంగా ప్లాస్టిక్ నిషేధ ప్రచారానికి శ్రీకారం చుట్టబోవడం విశేషం.

Air Pollution

ఈ ఏడాది భారతదేశంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ‘మిషన్ లైఫ్’. మనం నిర్దిష్టమైన జీవన పద్ధతుల ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటు పడడమే దీని ఉద్దేశం.

ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతున్నది. పెరిగిన జనాభా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నది. భారతదేశం ఇటీవల చైనా జనాభాను అధిగమించి ప్రపంచంలో అతి పెద్ద జనాభా గల దేశంగా అవతరించింది. జనాభా పెరుగుదలతో పాటు పట్టణాలు, నగరాలు కూడా పెరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతవాసులు మెరుగైన ఉపాధి కోసం నగరాలకు వలసపోతున్నారు. నగరాల్లో జనసాంద్రత పెరుగుతున్నది. మురికివాడలు ఏర్పడుతున్నాయి. సందర్భంలో ఆకాశ హర్మ్యాలు పెరిగిపోతున్నాయి.

అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములు, చెరువులు, కుంటలు అదృశ్యమౌతున్నాయి. నగరాలన్నీ కాంక్రీటు అరణ్యాలుగా మారుపోతున్నాయి. చినుకుపడితే రోడ్లన్నీ సముద్రాల్లా మారిపోతున్నాయి. డైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వివిధ పరిశ్రమల వలన, అభివృద్ధి పేరుతో జరుగుతున్న కార్యక్రమాల వలన కాలుష్యం పెరిగిపోయి, పర్యావరణం దెబ్బతింటున్నది. నగర జీవనం కలుషిత కారకాలతో కకావికల మౌతున్నది.

గత సంవత్సరంలోను, ఈ సంవత్సర ప్రారంభంలోను తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురిసాయి. ఇంతగా వర్షాలు కురిసినా ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఎంతగా వర్షాలు కురిసినా భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికీ కారణమేమిటి?

బొట్టుబొట్టును పొదుపు చేద్దామనే మాటలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. చెరువుల విధ్వంసం, కాంక్రీటు జనారణ్యాల పెరుగుదల, నీటిని ఒడిసి పట్టే ప్రణాళికలను గాలికి వదిలేయడం వలన పడిన ప్రతీచినుకూ వృథాగా మారిపోతున్నది. అపారమైన జలసంపద కడలిగర్భంలో కలిసిపోతున్నది. భూములు నీరులేక ఎడారులుగా మారిపోతున్నాయి.

పర్యావరణ విధ్వంసం వలన వాతావరణంలో అనేక అవాంఛనీయమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆకాలవర్షాల వలన అనేక నష్టాలు సంభవిస్తున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు విపరీతమైన ఎండలు, ఇంకోవైపు ఆకాశంలో నల్లని మేఘాలు, ఒకవైపు పొగమంచు. మరోవైపు ఉదయాన్నే ఉక్కబోత.. ఇలా విభిన్నమైన వాతావరణ వైరుధ్యాలు నెలకొంటున్నాయి.

తెలుగురాష్ట్రాలు నిప్పుల కొలిమిలా భగభగమండుతున్నాయి. ఇటీవల రాజమండ్రిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాలు భానుడి తీక్షణ వీక్షణకు బెంబేలెత్తిపోయాయి.

కొంతకాలం క్రితం విపరీతమైన వర్షాలతో జలప్రళయాన్ని చవిచూసిన హైదరాబాద్ మహానగరం ఈ ఏడాది ఏప్రిల్, మేనెలల్లో ఎండలతో భీతిల్లిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకు చెమటపట్టని వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉండే భాగ్యనగరం విపరీతమైన ఉష్ణోగ్రతల ప్రభావంతో తల్లడిల్లిపోతున్నది.

గతంలో బెంగళూరు నగరం సాయం కాలానికి చల్లని వాతావారణంతో అలరించేది. వాతావరణంలో నెలకొంటున్న కాలుష్యప్రభావం వలన, మానవ తప్పిదాల వలన సంభవిస్తున్న పరిణామాలు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఇకనైనా భూగోళాన్ని సజీవంగా నిలుపుకోవాలనే భావన మనందరిలో కలగాలి.

గ్రీన్ హౌస్ వాయువుల వలన భూగోళం వేడెక్కుతున్న కార్బన్ డై ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రోకార్బన్లలో మిథేన్ తదితర వాయువులను గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. పరిశ్రమల వలన రసాయనాల వ్యర్థాల వలన ప్లాస్టిక్ వినియోగం వలన భూగోళం పెనుముప్పు ఎదుర్కోవడం జరుగుతున్నది.

భూతాపం వలన భారత్ వంటి దేశాలతో పాటు చైనా, బంగ్లాదేశ్ వంటి పలు దేశాలు పలు సమస్యలను ఎదుర్కోబోతున్నాయి. న్యూయార్క్, లండన్, బ్యాంకాక్, ముంబై వంటి అనేక సముద్ర తీరనగరాలకు పెనుముప్పు ఏర్పడబోతున్నది.

Air Pollution : కోట్లాది సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనం ఫలితంగా భూమి ఏర్పడిందనే వాదన ప్రచారంలో ఉంది. భూమి ముందు ఏర్పడిందా, ఇతర గ్రహాలు ముందు ఏర్పడ్డాయా అనే సందేహానికి ఈనాటికీ స్పష్టమైన సమాధానం దొరకలేదు. భూమికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను చేధించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం తపిస్తున్నారు.

భూమి ఏర్పడిన తర్వాత భూమిపై జీవించడానికి అనేక వనరులు ఏర్పడ్డాయి. దీనితో జీవజాలం ఏర్పడింది. మానవులతో పాటు వివిధ రకాల జీవరాశులు ఉద్భవించి, మనుగడ సాగిస్తున్నాయి.

పెరిగిన విలాసవంతమైన జీవనవిధానం ప్రకృతిని విధ్వంసం చేస్తున్నది. నగరజీవనం అస్తవ్యస్తంగా మారింది. అడవులు నశించిపోతున్నాయి. పచ్చదనంతో వికసించిన ప్రకృతి నేడు దీనావస్థను చవిచూస్తున్నది. మానవ జీవనవిధానంలో సహజసిద్ధమైన పద్ధతులు నశించిపోయాయి. విషవాయువుల వలన వాతావరణం కలుషితమైపోయింది. గాలి, నీరు, ఆహారం కలుషితంగా మారింది.

మానవ అవసరాల కోసం సృష్టించుకున్న అనేక విధానాలు మానవ విధ్వంసానికి దారితీస్తున్నాయి. పెరిగిన అవసరాలు భూమిపై సహజసిద్ధమైన వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసాయి. పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం, వ్యవసాయరంగంలో వినియోగిస్తున్న రసాయనాలు, పెరిగిన అభివృద్ధి మానవ మనుగడకు ముప్పుగా మారింది.

ప్లాస్టిక్ వినియోగం నిత్యజీవితంలో పనవేసుకుపోయింది. వందల కోట్లటన్నుల ప్లాస్టిక్ భూమిలోను, సముద్రాల్లోను పేరుకుపోయింది. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి వేలాది సంవత్సరాల కాలం పడుతుంది. ప్లాస్టిక్ తగలబెట్టడం వలన కాలుష్యం పెరుగుతున్నది. స్వల్ప స్థాయిలో జరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ వలన పెద్దగా ప్రయోజనం లేదు.

ప్లాస్టిక్ తయారీయూనిట్లను మూసివేయకుండా ప్లాస్టిక్ వాడుతున్న ప్రజలపైన, వ్యాపార సంస్థలపైన కొరడా ఝళిపించడం వలన ప్రయోజనం లేదు. ప్లాస్టిక్ వినియోగం ఇలాగే కొనసాగితే భూగోళం ప్లాస్టిక్ నిలయంగా మారి, అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి.

బొగ్గు, పెట్రోల్, సహవాయువు వంటివి శిలాజ ఇంధనాలు, కార్బన్ డై ఆక్సైడ్ ప్రధానంగా ఉండే ఇంధనాల వాడకం వలన పర్యావరణం దెబ్బతింటున్నది. వాహనాల్లో వినియోగించే ఇంధనాలు వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయి. సహజమైన వనరుల ద్వారా లభ్యమయ్యే ఇంధన వనరులను వినియోగంలోకి తీసుకురావాలి.

పునరుత్పాదక ఇంధనశక్తి వినియోగం పెరగాలి. బయోఎనర్జీ, సూర్యరశ్మి, గాలి వలన లభించే శక్తి వనరులను శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించాలి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి కాలుష్యరహితమైన ఇంధనాల వైపు దృష్టిసారించాలి.

ఉచితంగా లభించే, కాలుష్యరహితమైన సౌరశక్తి మాత్రమే భవిష్య అవసరాలను తీర్చగలదు.

Air Pollution : చైనా 340 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలో అత్యధిక ఉత్పాదక దేశంగా అవతరించింది. చైనా సోలార్ పరికరాల మీద అధిక మొత్తం ఖర్చు చేస్తున్నది. 2025 నాటికి 33 శాతం విద్యుత్ను పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వినియోగించాలనేది చైనా లక్ష్యం. 2030 నాటికి చైనాలో సౌర, పవన ఉత్పత్తిని 1200 మెగావాట్లకి పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అమెరికా సుమారు 103 జి. డబ్ల్యూతో, జపాన్ 78, జర్మనీ 62 జిడబ్ల్యూకి పైగా సౌరసామర్థ్యం కలిగి ఉంది. భారతదేశం ప్రపంచంలో సౌరశక్తిని అధికంగా వినియోగించే దేశాల్లో ఐదవదేశంగా ఎదిగింది. భారతీయ సౌరశక్తి వినియోగం 57 మెగావాట్లు. భారతదేశం అత్యధిక సౌరశక్తి సామర్థ్యం గలదేశం. భారతదేశంలో ఏడాదిలో 300 రోజులకుపైగా సూర్యకాంతి లభిస్తుంది.

మానవ మేథస్సు కంటే ప్రకృతి అత్యంత బలీయమైనది. ఎన్నో పరిశోధనలు జరిగినా, ఎన్నో ఆవిష్కరణలు జరిగినా ఇప్పటి వరకు మానవుడు మృత్యువును, ప్రకృతిని జయించలేకపోయాడు. రోగానికి వైద్యపరంగా చికిత్స అందించవచ్చు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించవచ్చు. కాని ప్రకృతి విలయాలను ఆపడం సాధ్యం కాదు.

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రకృతి విపత్తుల వలన సంభవించే ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని పూర్తిగా నివారించలేకపోయినా కనీసస్థాయికి తగ్గించే అవకాశాలున్నాయి. ప్రకృతి విలయాలను ఆపడం సాధ్యం కాదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రకృతి విపత్తుల వలన సంభవించే ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని పూర్తిగా నివారించలేకపోయినా కనీసస్థాయికి తగ్గించే అవకాశాలున్నాయి.

ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి, నష్టాన్ని సాధ్యమైనంత తక్కువస్థాయికి తగ్గించే అవకాశాలున్నాయి. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి, నష్టాన్ని సాధ్యమైనంత తక్కువస్థాయికి తగ్గించడం కేవలం మన విచక్షణపైనే ఆధారపడి ఉంది.

పర్యావరణ పరిరక్షణ వలన చాలావరకు మానవాళి సురక్షితంగా ఉండగలదు. మానవైఫల్యాల వలన, ప్రకృతిలో సంభవించే తీవ్రమైన పరిణామాలను, జననష్టాన్ని కనీసస్థాయికి తగ్గించగలగాలి. ప్రపంచాన్ని ఎలాంటి విపత్తులు లేకుండా కాపాడాలనే మానవ సంకల్పానికి వికల్పమే వైపరీత్యం’.

ప్రకృతి విపత్తులన్నీ చాలావరకు మానవ తప్పిదాలు కారణంగానే సంభవిస్తున్నాయి. వరదలు, భూకంపాలు, తుపానులు, సునామీలు ఇత్యాధులన్నీ సహజ విపత్తులు, ప్రజల ప్రాణాలకు ఆస్తులకు నష్టం కలిగించి, విధ్వంసం చేసి, కోలుకోలేని విధంగా మానవ జీవితాలను అతలాకుతలం చేసిన అనేక సంఘటనలు ఈ ప్రపంచంలో సంభవించాయి.

అతివృష్టి వలన వరదలు సంభవించడం, ప్రజాజీవితాన్ని స్తంభింపచేయడం, అనావృష్టి వలన పంటలన్నీ ఎండిపోయి, ఆహారోత్పత్తి దెబ్బతినడం, తాగడానికే నీరులేక కటకట లాడడం మనం చూస్తున్నాం. వీటన్నింటినీ విపత్తులుగా పేర్కొనవచ్చు. జనజీవనానికి తీవ్రవిఘాతం కలిగించి, జీవనోపాధిని దెబ్బతీసి, ప్రాణాలకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంలో ప్రకృతి విపత్తుల ప్రభావం అధికం.

ప్రకృతి వైపరీత్యాల నుండి కోలుకుని, జనజీవనం సాధారణస్థితికి రావడానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజాజీవనాన్ని పునరుద్దరించడానికి ప్రభుత్వాల, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల అవసరం ఎంతైనా ఉంది.

మానవ జీవితాలను అతలాకుతలం చేసే ఇలాంటి ప్రమాదాలన్ని సాధారణ స్థాయిని దాటి తీవ్రమైన స్థితికి చేరడం వలన విపరీతమైన ప్రాణనష్టం జరుగుతున్నది. ప్రకృతి వైపరీత్యాల్లో వాతావరణ పర్యావరణ, సంబంధమైన అంశాలు మిళితమై ఉన్నాయి. ప్రస్తుతం ఏర్పడుతున్న వైపరీత్యాల్లో మానవ ప్రేరిత వైపరీత్యాలదే సింహభాగం.

ఈ భూప్రపంచంలో మానవ మనుగడ కొనసాగించాలంటే పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలి. స్వార్థప్రయోజనాల కోసం చెట్లను నరికే విధానం మారాలి. వృక్షజాతిని పెంపొందించాలి. మొక్కలను నాటే కార్యక్రమాన్ని దైవభక్తి, దేశభక్తితో ముడిపెట్టాలి. అప్పటివరకూ మొక్కలు నాటే కార్యక్రమం ఊపందుకోదు.

చెట్లను పెంచడం వలన భూతాపం తగ్గుతుంది. వాయుకాలుష్యం తగ్గి మనం పీల్చేగాలిలో నాణ్యతాశతం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు అరికట్టబడతాయి. వాతావరణం చక్కబడుతుంది.

పచ్చని చెట్లను నరకడం వలన వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. మానవాళికి అవసరమైన ప్రాణవాయువు లభించడం లేదు. కాలుష్యం పెరిగి, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. మానవ మనుగడకు రక్షాకవచమైన ఓజోన్ పొర దెబ్బతినడం వలన రేడియోధార్మికత వెలువడుతున్నది. దీని వలన అనేక విపత్కర పరిణామాలు సంభవిస్తున్నాయి.

వాతావరణంలో అవాంఛనీయ పరిణామాలకు మనదే బాధ్యత. గ్లోబల్ వార్మింగ్ ఒక విషమసమస్య. ఈ విషమసమస్యకు విరుగుడు కూడా మనచేతుల్లోనే ఉంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తే, వాతావరణం మెరుగుపడుతుంది.

భూగ్రహం కూడా విశ్వంలో భాగమే

భూగ్రహంపై మూడొందల నీరు, ఒకవంతు భూమి కలదు. వృక్షాలతో, నదీనదాలతో, కొండలు, లోయలు, సముద్రాలతో పలు జీవరాశులతో విభిన్నమైన భౌగోళిక నైసర్గిక స్వరూపాలతో, పచ్చని ప్రకృతి మధ్య జీవించే మహద్భాగ్యాన్ని మానవుడే చెరిపేస్తున్నాడు.

స్వార్థప్రయోజనాల కోసం విచక్షణ కోల్పోయి ప్రకృతిని చెరబట్టి, వికృతంగా మారుస్తున్నాడు. అడవులను నరికి నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, పంటభూములను మానవావసరాలకు వినియోగించడం, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా వినియోగించడం వలన ధరిత్రిపై కాలుష్యపు క్రీనీడలు కమ్ముకుంటున్నాయి.

అడవులను ధ్వంసం చేయడం వలన భూఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే 2036వ సంవత్సరం నాటికి ‘గ్లోబల్ వార్మింగ్’ సమస్య పెరిగి భూమిపై మనుగడ సాగిస్తున్న పలు జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్థకమౌతుంది.

పర్యావరణం కాలుష్యంతో నిండిపోయింది. మానవ నివాసయోగ్యం కాని ప్రదేశంగా భూగ్రహం పరివర్తన చెందబోతున్నది. ఇకనైనా మేలుకోవాలి.(Air Pollution)

Read This : https://vaartha.com/category/cover-stories/

Read Also : Delhi: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..ఇబ్బందిలో నగరవాసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870