కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లిలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ప్రతిపాదించిన ఏరోస్పేస్ పార్క్
(Aerospace Park) నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ రైతుల వ్యతిరేకతతో ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణకు సంబంధించి రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ, ఏరోస్పేస్ పార్క్ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం సోషల్ మీడియా సహా పరిశ్రమ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది.
లోకేష్ వ్యూహాత్మక ఆహ్వానం – అనంతపురానికి అవకాశం
ఈ పరిణామంపై వెంటనే ఏపీ ఐటీ మరియు పరిశ్రమల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. కర్ణాటక వెనక్కి తగ్గిన సమయంలో, ఏరోస్పేస్ పరిశ్రమకు అనువైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అందించేందుకు తామంతట తాము సిద్ధంగా ఉన్నామని లోకేష్ వెల్లడించారు. ప్రత్యేకంగా 8000 ఎకరాల భూమి, ఆకర్షణీయమైన పాలసీ, ఉత్తమ ప్రోత్సాహకాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇది బెంగళూరు సమీపంలోనే ఉన్నందున పరిశ్రమలకు వ్యాపారపరమైన లాజిస్టిక్ ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. ఈ ట్వీట్ పరిశ్రమల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించగా, సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కర్ణాటక ప్రభుత్వం క్లారిటీ – పార్క్ ఎక్కడికీ వెళ్లదంటూ హామీ
లోకేష్ ట్వీట్‌కు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సానుకూలంగా స్పందించినా, అనంతరం ఆయన ట్వీట్‌ను తొలగించారు. ఇదిలా ఉంటే, పరిశ్రమలు ఏపీకి తరలిపోతాయన్న ఆందోళన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి స్పందించారు. కర్ణాటక కేవలం భూమిని అందించేదేగాక, దేశంలో నంబర్ 1 ఏరోస్పేస్ & డిఫెన్స్ ఎకోసిస్టమ్‌ను కలిగి ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏరోస్పేస్ ఉత్పత్తిలో 65% వాటాతో కర్ణాటక ముందంజలో ఉందని తెలిపారు. ఏరోస్పేస్ పార్క్ ఎక్కడికీ వెళ్లదని స్పష్టం చేశారు. అయితే ఈ పరిణామం అనంతపురానికి అభివృద్ధి అవకాశాలను తెరలేపే సూచనలుగా పరిశీలించవచ్చు.