జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో (Parliament Sessions) కాంగ్రెస్ పార్టీ కీలక వ్యూహాన్ని అమలు చేయనుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, జాతీయ భద్రత పరిస్థితి, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తీసివేయడంపై కొనసాగుతున్న అనిశ్చితి వంటి అంశాలను ప్రస్తావించాలనే ఆలోచనలో ఉంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని పార్లమెంటులో సవాల్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
నిరుద్యోగం, రైతు సమస్యలపై దృష్టి
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం కూడా కాంగ్రెస్ ప్రస్తావించనున్న ప్రధాన అంశాలలో ఒకటిగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది. అలాగే, రైతులకు సరైన మద్దతు ధరలు లభించకపోవడం, సాగు ఖర్చులు పెరిగిపోవడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది.
అభిశంసన తీర్మానం.. రాజకీయంగా వేడి
ఈ సమావేశాల్లో మరో కీలక పరిణామంగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ తీర్మానం చర్చకు వస్తే, అది రాజ్యాంగవ్యవస్థల మధ్య బలమైన చర్చలకు దారితీయవచ్చు. కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా ఒక కీలక వ్యూహాత్మకంగా వినియోగించేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ బలమైన వ్యూహాలతో బరిలో దిగుతోంది.
Read Also : Air India Plane Crash : ‘బోయింగ్’లో ఆ సమస్య లేదు – ఎయిర్ ఇండియా