Bathukamma : తరతరాల సజీవన సంస్కృతులు, సంప్రదాయాలకు పల్లెలు వాళ్లు ప్రతి పండుగ ఆచారాలు, సంస్కృతిని ప్రస్ఫుటిస్తుంది. తరతరాలుగా పెద్దలిచ్చిన ఆస్తిపాస్తుల్ని దాచిపెట్టుకొని, ముందు తరాల వారికి అందించడమే ఆనవాయితీ అనుకుంటే పొరపాటు. ఎందుకంటే సంపద కంటే గొప్పది సంస్కృతి. సంస్కృతిలోనే జీవన విలువలు దాగున్నాయి.

ఆ విలువలు ప్రకృతితో మమేకమై జరుపుకునే ప్రతీ పండుగలోనూ ఉంటాయి. ప్రకృతి అనే శక్తికి భక్తి అనే ఆచారంతో ప్రజలందరినీ రక్షించమనే వేడుకోలు వినిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోదగ్గ ఆట పాటల పండుగ ‘బతుకమ్మ‘ ప్రపంచంలో ఎక్కడా లేని, కనీ వినీ ఎరుగని విధంగా ప్రకృతిపూల బతుకమ్మ పండుగను తెలంగాణలోనే జరుపుకోవడం విశేషం.
ఈ ఆశ్వయుజ మాసం మహాలయ అమావాస్య రోజున ‘ఎంగిలిపూలు’ పేరుతో మొదలై ‘దుర్గాష్టమి’ నాటి ‘సద్దుల బతుకమ్మ’తో ముగుస్తుంది. పిల్లలు, పెద్దలు, వయస్సుతో సంబంధం లేకుండా ఆత్మీయానుబంధాలతో కలసి మెలసి, ఆడిపాడుకునే పండుగ బతుకమ్మ. మహాలయ అమావాస్య మొదలు తొమ్మిది రోజులు భక్తితో గౌరమ్మకు మహిళలు పూజలు చేసే పండుగ.
ఆశ్వయుజ మాసంలో ప్రకృతంతా పచ్చదనంతో పుడమిపై నిండు ముత్తైదువలా కొలువై ఉంటుంది. రంగు రంగుల పువ్వులతో భూమి ఇంద్రధనస్సు చీరెను చుట్టుకొన్నట్లు ఉంటుంది. మహిళలు, ఇంటి ఆడపడుచులు, ఎంత దూర ప్రాంతంలో ఉన్నా తమ పుట్టింటికి ఆనందంతో వచ్చే పండుగ బతుకమ్మ.
మెట్టినింట్లో ఎన్ని బాధలున్నా, కొంత విడుపుగా తల్లిగారింటికి వచ్చి బంధువులను, స్నేహితులను, ఊరిని చూసుకొని ముచ్చటించుకునే ఆటపాటల పూల పండుగే కాకుండా తొమ్మిది రోజుల స్త్రీల పండుగ. వానలు వెలిసిన తర్వాత నిండు కుండల్లా నీళ్లతో చెరువులన్నీ కళకళలాడుతూ ఉన్న తరుణంలో, శరదృతువు ప్రవేశించే శుభ ఘడియల్లో తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో పల్లె పల్లెనా, పట్టణాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రకృతి పూల పండుగ బతుకమ్మను జరుపుకోవడం విశేషం.
ప్రకృతితో మమేకమై జరుపుకునే ఈ తొమ్మిది రోజుల పండుగకు ఎంతో ప్రాచుర్యం ఉంది. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మను ఒక్కొక్క రోజు ఒక్కో పేరుతో పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ; రెండో రోజు అటుకుల బతుకమ్మ; మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ; నాలుగో రోజు నానుబియ్యం బతుకమ్మ; ఐదో రోజు అట్ల బతుకమ్మ; ఆరో రోజు అలిగిన బతుకమ్మ; ఏడో రోజు వేపకాయల బతుకమ్మ; ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ; తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ.

బతుకమ్మను పేర్చడం వివిధ రకాల పూలతో పళ్లెంలో లేదా వెదురు బుట్టల్లో ఆకుపచ్చని ఆకులు (గుమ్మడి ఆకులు) పరిచి దొంతరలు దొంతరలుగా రంగు రంగుల పూల వరుసలను పేర్చి, పైన పసుపుతో గౌరమ్మను ఉంచి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పెద్దదిగా పేర్చడం విశేషం. తరువాతి రోజుల్లో చిన్నగా పేరుస్తారు. దుర్గాష్టమి రోజున చేసే బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’ అంటారు.
Bathukamma : విధంగా బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో పేర్చి, సాయంత్రం ఆడి పాడి స్త్రీలందరు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు ఎంతో సంబురంగా బతుకమ్మలను పేర్చి పండుగ జరుపుకోవడం నేటికీ ఆచారంగా అనుసరించడం మన సంస్కృతికి ఆనవాయితీగా చెప్పుకోవచ్చు.
పాత రోజుల్లో మహిళలంతా కలిసి గ్రామాల్లో ఒకే దగ్గర బతుకమ్మను పేర్చి గౌరీదేవతకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడేవారు. రాను రాను కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో సాయంత్రం మహిళలు తమ ఇంటివద్దనే బతుకమ్మలను పేర్చి ఆడి, తర్వాత బతుకమ్మలను తోటి మహిళలతో సమీప చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ బతుకమ్మ పాటలతో భక్తి శ్రద్ధలతో ఆడి పాడి నిమజ్జనం చేస్తారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర పండుగగా బతుకమ్మ మరింత వైభవాన్ని సంతరించుకుంది. వర్గ, వర్ణ, కుల, ప్రాంత భేదాలు లేకుండా సమతా ప్రతీకగా వెలుగొందుతోంది. బతుకమ్మ నైవేద్యాలదీ ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. ఈ తొమ్మిది రోజులలో ఒక్కోరోజు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రదాయినిగా ప్రసాదం చేస్తారు.

- మొదటి రోజు నువ్వులు, బెల్లంతో చేసిన ప్రసాదం.
- రెండో రోజు బెల్లం, అటుకులతో ప్రసాదం.
- మూడో రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో ప్రసాదం.
- నాలుగో రోజు నానుబియ్యం, పాలు, బెల్లం నైవేద్యం.
- ఐదో రోజు అట్ల బతుకమ్మ – అట్లు నైవేద్యంగా.
- ఆరో రోజు అలిగిన బతుకమ్మ – ఆ రోజు బతుకమ్మ ఆడరు.
- ఏడో రోజు వేపకాయల బతుకమ్మ – బియ్యంపిండి ఉండలు.
- ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ – నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లంతో.
- తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ – మలీద ముద్దలు ప్రసాదం.
ఈ ప్రసాదాలన్నీ ఆరోగ్యప్రదాయినిలే. ప్రకృతిని ఆరాధిస్తూ బంగారు భవిష్యత్తుకు ఎలాంటి ఆపద రాకుండా నిండునూరేళ్లు జీవితం పండుగలా సాగాలని గౌరీమాతను పూజించడమే బతుకమ్మ పండుగ. బతుకమ్మను పేర్చాక పసుపుతో గౌరీమాతను తయారు చేస్తారు. బతికించి కోరికలు తీర్చే అమ్మగా గౌరీమాతను మహిళలు పూజిస్తారు.
పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్లయిన స్త్రీలు నిండునూరేళ్లు తమ భర్త, కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని బతుకమ్మను పూజిస్తారు. ఈ పండుగలో స్త్రీలు అనేక రకాల పాటలు పాడతారు. ఒక స్త్రీ పాట చెబుతుంటే, మిగతావాళ్లు వంతగా పాడతారు. ఉయ్యాల, కోలో, వలలో, కోయిలా, తుమ్మెదా, రామచిలకా, ఓ రాచగుమ్మడి, చెలియ, మల్లియలో, చందమామ, గౌరమ్మ వంటి పదాలతో పాటలు పాడి పండుగకు రక్తికట్టిస్తారు.
బతుకమ్మ ఒక సామూహిక ఉత్సవం. ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలసి ఈ పండుగలో పాలుపంచుకుంటారు. మగవారు సైతం బతుకమ్మ పేర్చడానికి, నిమజ్జనం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
తరాలు మారినా, వేషధారణలు మారినా, సంస్కృతిలో భాగమైన ప్రకృతి పూల పండుగను భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగగా జరుపుకోవడం విశేషం! తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఈ పండుగను అదే భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బతుకమ్మ చారిత్రక విశిష్టతను గుర్తించి రాష్ట్ర పండుగగా అధికారిక గుర్తింపు ఇవ్వడం గర్వకారణం.(Bathukamma)