తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth) ఇటీవల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూనే గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాలనలో KCR చేతికి రూ. 20 లక్షల కోట్లు వచ్చాయని, అందులో రూ. లక్ష కోట్లు కొందరి జేబుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. ప్రజల బదులుగా కొందరు వ్యక్తుల లాభం కోసమే ప్రభుత్వ నిధులను వాడారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో రాజకీయ దాడి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శల వర్షం
రెవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం (Kaleswaram) మూడేళ్లలోనే కూలేశ్వరం అయ్యింది” అంటూ వ్యాఖ్యానించారు. భారీగా ఖర్చు చేసిన ప్రాజెక్ట్ తక్కువ కాలంలోనే విఫలమవడం ప్రజల పన్ను డబ్బుకు అవమానమన్నారు. దీనికి భిన్నంగా తమ పాలనలో నిర్మించిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికీ బాగానే పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. నిజమైన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన వాటికి ఈరోజు స్థిరమైన విలువ ఉందని తెలిపారు.
చర్చకు సవాల్
“ఈ విషయాలపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం. కూలిన కూలేశ్వరం వద్ద మిమ్మల్ని ఉరితీసినా తప్పులేదు” అంటూ ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజలకు బహిరంగంగా చర్చ చేద్దామంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలకు నూతన ప్రభుత్వ విధానాలు ఎలా ఉపయోగపడతాయో ప్రస్తావిస్తూ, గత పాలనలో జరిగిన తప్పిదాలపై సమీక్ష అవసరమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
Read Also : One District-One Product : ఏపీకి 10 అవార్డులు