దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూప్రకంపనల (Earthquake) ధాటికి కొద్ది క్షణాలపాటు వణికిపోయింది. శుక్రవారం సాయంత్రం 7:49 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. గతంలో గురువారం కూడా ఢిల్లీలో 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించడంతో ఇది వరుసగా రెండో రోజు భూకంపం రావడం గమనార్హం. దీంతో ప్రజలు భారీగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఎన్‌సీఆర్‌లో భయాందోళన
ఈ భూకంప కేంద్రం ఝజ్జార్ సమీపంలోని భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హర్యానా వంటి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా అనిపించాయి. తక్కువ తీవ్రత కలిగిన ప్రకంపనలు వచ్చినప్పటికీ, వరుసగా భూమి కదలికలు సంభవించడంతో ప్రజల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి. భవనాల్లో నివసించే వారు బిల్డింగుల నుంచి బయటకు పరుగులు తీస్తూ సురక్షిత ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నం చేశారు.
ఆస్తి, ప్రాణ నష్టం లేదు – అధికారుల ప్రకటన
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంప ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయినా భూకంపాలకు గురైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ, భూకంప పరిశోధన సంస్థలు భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందా లేదా అన్న విషయంపై సమీక్ష చేస్తున్నారు. వరుస భూప్రకంపనలు రావడం గమనించి ప్రజలు అల్లకల్లోలానికి లోనవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచనలిస్తున్నారు.
Read Also : Pragya Agarwal : మహిళా ప్రొఫెసర్ ప్రజ్ఞా అగర్వాల్ అనుమానాస్పద మృతి