తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల కోసం గృహ కలను సాకారం చేయడంలో తమ ప్రభుత్వం తొలి అడుగు వేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) గర్వంగా ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం జరిగిన పర్యటనలో ఆయన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ, పేదలకు గృహ హక్కు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఏకకాలంలో 4.5 లక్షల ఇళ్ల మంజూరు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే రూ.22,500 కోట్ల భారీ బడ్జెట్‌తో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను (Indiramma’s house) మంజూరు చేసిందని భట్టి తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి ఇన్ని గృహాలు కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన విమర్శించారు.
బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు గుప్పించిన భట్టి విక్రమార్క, వారి హయాంలో పేదల కోసం ఎటువంటి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రత్యేకించి గృహ అవసరాలపైన బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు.
రైతులకు భరోసా – యువతకు అవకాశాలు
రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం రైతు భరోసా కోసం రూ.17,500 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. నిరుద్యోగుల కోసం రూ.8 వేల కోట్లతో ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని, డ్వాక్రా మహిళలకు రూ.లక్ష కోట్లతో రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ, రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు.
మధిర పట్టణ అభివృద్ధికి కొత్త వెలుగు
మధిర పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.6.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంబారుపేట పెద్ద చెరువు ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంతో పట్టణానికి కొత్త శోభ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువు చుట్టూ పర్యావరణ అనుకూల సుందరీకరణ, వాక్‌వేలు, లైటింగ్ తదితర పనులు చేపట్టబోతున్నట్టు పేర్కొన్నారు.
Read also: TG High Court: డిప్లొమా కోర్సు ఇంటర్మీడియట్‌కు సమానమే.. హైకోర్టు తాజా తీర్పు