ఎంతో ఇంతో అని తెలుపలేని అమూల్యం..
ఎన్నింటినో పొదివి పట్టుకున్న భాండాగారం.
ఎంత తలచిచూచిన తనివితీరని
ఆనందం ఎన్నో మదిలో అలా ఆమోద
ముద్రితం ఏది ఏమైనా అవుననే
మరువలేని అంతరంగం.
తరుముతూ తరచి తరచి, చూడమనేవి.
తన మన అందరిని తలచేలా చేసేవి
తీయతీయనివి తిరిగిరాని
తీసిపారేయలేనివి తుడవలేనివి
నీడలా వెన్నంటే నిలిచేవి.
ఎదురయ్యే ప్రతీది ఏదో సంబంధమనేది
ఎన్నింటినో పరిచయం చేస్తూ మరుపేల అనేది.

ఎన్నో మరువలేని జ్ఞాపకాలు మిగిల్చేది ఎదలో ఎప్పుడూ పదిలమనే ఆణిముత్యమది.
ఎందుకో ఒకోసారి సంతోషాన్ని
మరోసారి ఎనలేని దుఃఖాన్ని
ఎదుటివారిలో ఆనందం మరొకరిలో
బాధని ఎన్నో గుర్తుకు తెచ్చుకోమనే
భారమైన జ్ఞాపకాలు, ఎప్పుడూ మనలోనే
బరువుగా భావించిన ఎల్లవేళలా ప్రతిధ్వనిస్తూ.
ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఎండమావుల్లో
సహితం నీ మదిలో నేనున్నాననేది
ఎల్లవేళలా నెమరేసుకోమనే నిశ్శబ్దమది.
నేను.. ఆమె
నిద్ర రావడం లేదని మబ్బులో
లేచి కాంపౌడ్లో కూర్చున్నాను.
ఆమె కూడా పరుపులోంచి వచ్చి
నన్ను ఆనుకొని బంగారు జరీ వస్త్రాల
అస్త్రాల బాలసూర్యుని
ఆగమనానికి నిరీక్షిస్తూ నేను
కుండీలో సన్నజాజి పూలవాసన ఆస్వాదిస్తూ
ఆమె ప్రకృతి లయాత్మక దృశ్యంలో
నేను రసాత్మక కావ్యంలో ఆమె
నేను.. ఆమె అలానే
చూస్తున్నాను..
కళ్ళు తేట పడుతున్నాయి
మనసు లోపలి చీకటి
క్రమక్రమంగా మాయమౌతుంది..
హృదయం మంచు పువ్వై వికసిస్తోంది
దేహంలో ఒక సెలయేటి ప్రవాహం
కదలాడుతుంది..
ఆ సమయంలో నేను ఉన్నానో
నన్ను నేను మరచిపోయానో
ఆ కాసేపు నా ప్రపంచంలోకి
ఒక సౌందర్య స్వరూపమై ఆవరించింది
ప్రేమరాణిలా.. వేపచెట్టు మీదుగా
పండు వెన్నెలై నిండు జాబిలి పలకరించింది. ఆ ఆ కాసేపు అలానే చూస్తూ కూర్చున్నాను అన్నట్టు అది ఉపగ్రహమా? కాదు కాదు.. నా కవిత పంక్తుల్లోని అందమైన పోలిక అది అచ్చమైన స్వచ్ఛమైన జీవితానికి ఒక సంజీవని మూలిక కవులకు ప్రియమైన కానుక.

కల్ప తరువు

దివి నుంచి భువికి వర్షాన్ని రప్పించెదను
జీవకోటికి దాహార్తి తీర్చెదను
సమస్త జీవరాసులకి
ప్రాణ వాయువును అందించి
వాటి మనుగడకి దోహదపడెదను
మీకు మంచి ఫలాలును అందించి
మీ ఆకలిని తీర్చెదను
మీ ఇంట్లో వంట కొరకు
వంట చెరకునై మండెదను
నా కర్రలతో మీకు నివాసాన్ని ఏర్పరచి
మీకు ఒక గూడునిచ్చెదను
దారిలో వెళ్లే బాటసారులకి నీడనిచ్చి
నా ఒడిలో హాయిగా సేద తీర్చెదను
నా పువ్వుల్లోకి మకరందం స్వీకరించి
తేనెటీగలు మీకు తేనెనిచ్చును
ఎన్నో రకాల పక్షులకి నా గుటిలో
ఆవాసాన్నిచ్చెదను.
వృద్ధాప్యంలో మీ చేతిలో ఊతకర్రనై
మిమ్మల్ని ముందుకు నడిపించేది నేనే
మీరు కాలం చేశాక మిమ్మల్ని
పాడెనై కాటికి మోసేది నేనే
మీ చేతిలో కాలే ఆఖరి కట్టెను నేనే
మీరు నన్ను రక్షిస్తే
జననం నుంచి మరణం వరకు
సదా మీ వెన్నంటే ఉంటా.
ప్రకృతి ఒడిలో

ఒకింత ఉల్లాసం తూనీగలు
తిరుగాడుతుంటే ఒకింత సంతోషం
సీతాకోకచిలుకలు ఎగురుతుంటే
ఒకింత ఆనందం కోయిలలు గానం
వింటుంటే ఒకింత ఆహ్లాదం
పచ్చిక బయళ్లు తలూపుతుంటే
ఒకింత మనోహరం
పూలు పరిమళం వెదజల్లుతుంటే
ఒకింత పులకింత నెమళ్లు
పురివిప్పుతుంటే ఒకింత గిలిగింత
చిలుకలు పలుకుతూ ఉంటే
ఒకింత ఆశ్చర్యం సాలీళ్లు గూళ్లు
అల్లుతూ ఉంటే ఒకింత ఉత్సాహం
సమీరం చల్లగా మీటుతూ ఉంటే ఒకింత పరవశం
వాన తుంపరలు తాకుతూ ఉంటే
ఒకింత సంబరం అంబరాన విహంగాలను వీక్షిస్తుంటే
ఒకింత తన్మయత్వం స్తుంటే సేద తీరుతుంటే.
Read also: Panchatantra: ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’