ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షలో పేదల భూసంబంధిత సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వారసత్వ భూముల విషయంలో ప్రజలకు మేలిచేసే మార్గాలను సూచించారు. రూ.10 లక్షల లోపు విలువ కలిగిన భూములకు గ్రామ/వార్డు సచివాలయంలో కేవలం రూ.100 ఫీజుతో, రూ.10 లక్షలు దాటిన భూములకు రూ.1,000 ఫీజుతో సెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేయవచ్చని సీఎం తెలిపారు. ఇది పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.
ఫ్రీహోల్డ్ భూముల సమస్యల పరిష్కారానికి గడువు
రెవెన్యూ వ్యవస్థలో అపరిష్కృతంగా ఉన్న ఫ్రీహోల్డ్ భూముల సమస్యల(Freehold Land Issues)పై కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది పేదలు తమకు అప్పటి నుంచి ఉపయోగంలో ఉన్న భూములపై పూర్తి హక్కు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీలోగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. అధికార యంత్రాంగం ప్రజలకు సహాయకంగా ఉండాలని, ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పేదలకు భూహక్కు లభ్యమయ్యే విధంగా కార్యాచరణ
పేదలకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫ్రీహోల్డ్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, లబ్ధిదారులకు నష్టముకాకుండా పథకం అమలయ్యేలా చూడాలని సూచించారు. భూసంబంధిత సేవలను వేగవంతం చేయడం, భద్రత కల్పించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. భూమిపై న్యాయమైన హక్కును కల్పించడం ద్వారా సామాజిక న్యాయం అమలవుతుందన్నది చంద్రబాబు ఆశయం.
Read Also : BJP : 11 ఏళ్లలో తెలంగాణ కు మోదీ ఏం ఇచ్చారు? – ఖర్గే