తెలంగాణలో సంక్షేమ పథకాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రత్యేకించి ‘ఇందిరమ్మ’ (Indiramma ) పేరిట ప్రారంభించిన పథకాలపై విపక్షాలు ధర్నాలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇందిరమ్మ భోజన పథకానికి, సంక్షేమ పథకాలకి ఆమె పేరు పెట్టామన్న కారణంగా కొందరు రెచ్చిపోతున్నారు. అలాంటి వారిని బట్టలిప్పి కొడితే తప్ప, ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇందిరా గాంధీ తీసుకొచ్చిన చట్టం
సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఇందిరా గాంధీ తీసుకొచ్చిన చరిత్రాత్మక నిర్ణయాలను గుర్తు చేశారు. దేశంలో భూసంస్కరణలు చేసి, సీలింగ్ చట్టం ద్వారా పెద్దల భూములను పేదలకి పంచిన ఘనత ఇందిరాకు దక్కుతుందని అన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇచ్చిన మహా నాయకురాలు ఆమెనే అన్నారు. “ఆమె తీసుకొచ్చిన సంక్షేమ ధోరణే ఈరోజు పేదవాళ్ల ఇళ్లలో వెలుగులు నింపుతోంది” అని కొనియాడారు.
ఇందిరమ్మ పేరుతో కొనసాగే సంక్షేమం
ప్రజల హక్కులకు నిలువెత్తు ప్రతీకగా నిలిచిన ఇందిరమ్మ పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. పేదల కడుపు నింపే రూ.5 భోజన పథకం నుంచీ, ఇళ్ల నిర్మాణం వరకు అన్ని కార్యక్రమాలు ఇందిరమ్మ స్ఫూర్తితోనే అమలవుతున్నాయని చెప్పారు. కానీ కొందరు రాజకీయ నాయకులు ఈ పేరుపై సైతం అభ్యంతరం తెలుపడం బాధాకరమన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సేవ చేసిన నేతల పట్ల గౌరవంగా భావించాలని పేర్కొన్నారు.
Read Also : Hyderabad : 60వేల ఉద్యోగాలిచ్చాం.. కాదని నిరూపిస్తే క్షమాపణ చెబుతా – సీఎం రేవంత్