తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ పరిపాలనలో మరో కీలక అడుగు వేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా అందించేందుకు రూపొందించిన మీ సేవ (Mee Seva) సేవలు ఇప్పుడు మరింత విస్తరించబడ్డాయి. తాజాగా, వివాహ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ విలువ సర్టిఫికెట్ వంటి ముఖ్యమైన సేవలను కూడా మీ సేవ ద్వారా పొందే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ, నిర్మాణ రంగానికి చెందిన వ్యాపారవేత్తలకూ ఎంతో ప్రయోజనకరం. మీ-సేవ లేదా ఆన్లైన్లో తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా, గ్రామ వివరాలను సమర్పించి ఏదైనా భూమికి సంబంధించిన తాజా మార్కెట్ విలువను సులభంగా పొందవచ్చు. ఈ అప్లికేషన్లను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 24 గంటల్లో పరిశీలిస్తుంది.
మీ సేవ అందుబాటు ద్వారా లభించే తాజా సేవలు:
2025 జూన్ 30న ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించిన తాజా సేవలతో నిర్మాణ రంగం, స్థిరాస్తి వ్యాపారులకు ఈ సదుపాయం ఎక్కువగా ఉపయోగపడనుంది. వివాహ ఫొటోలు, చిరునామా, వయసు ధ్రువీకరణ సంబంధిత పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకుంటే సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్ఆర్ఓ) నుంచి వివాహ ధృవీకరణ సర్టిఫికెట్‌ను నేరుగా జారీ చేస్తారు.
డిజిటల్ పాలనలో ముందడుగు:
ఈ సేవల విస్తరణతో డిజిటల్ గవర్నెన్స్‌లో ఇదొక కీలక అడుగని, ఇప్పటికే మీ-సేవలో ఆర్టీఏ, ఇసుక బుకింగ్, పాన్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టీ-ఫైబర్, అదనపు కియోస్కీలను కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 150 కి పైగా ప్రభుత్వ సేవలను ఇప్పటికే అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే అందుబాటులో ఉన్న మీ సేవల లిస్ట్:
- పేరు మార్పిడి సర్టిఫికేట్లు
- కుల, ఆదాయం ధృవీకరణ
- స్టడీ గ్యాప్ సర్టిఫికేట్
- మైనారిటీ ధృవీకరణ పత్రాలు
- ఆధార్ సంబంధిత సేవలు
- క్రీమీలేయర్/నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్లు
- రెసిడెన్సీ/లోకల్ క్యాండిడేట్ ధృవీకరణ
- ఖాస్రా, పహాణీ సర్టిఫికేట్లు
- జనన/మరణ ధృవీకరణ పత్రాలు
- విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపులు
- ఆస్తి పన్ను చెల్లింపు
- లెర్నర్స్ లైసెన్స్ అప్లికేషన్
- ఇసుక బుకింగ్
- పాన్ కార్డు అప్లికేషన్
- RTA సేవలు
Read also: Sigachi Blast: ఆశలన్నీ కన్నీరయ్యే..ప్రమాదంలో మృతి చెందిన దంపతులు