బెంగళూరు నగరంలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. సహజీవనం చేస్తున్న యువతిని హతమార్చి, ఆమె మృతదేహాన్ని చెత్త లారీలో పడేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అనంతరం నిందితుడినిగుర్తించి అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం బెంగళూరులోని బీబీఎంపీ (బృహత్ బెంగళూరు (Bengaluru) మహానగర పాలికే) సిబ్బంది చెత్తను తరలిస్తుండగా ఓ చెత్త లారీలో అనుమానాస్పదంగా ఉన్న ఒక గోనె సంచిని గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా, అందులో ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆమె చేతులు కట్టేసి ఉన్నాయి. ఈ భయంకర దృశ్యం చూసి షాక్‌కు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు
అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బైక్‌పై ఒక సంచిని తీసుకువచ్చి చెత్త లారీలో పడేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ ఆధారాలతో పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిని అస్సాంకు చెందిన 33 ఏళ్ల మహమ్మద్ షంషుద్దీన్ (Mohammed Shamshuddin), మృతురాలిని ఆశాగా పోలీసులు గుర్తించారు.ఏం జరిగిందంటే,నిందితుడు షంషుద్దీన్, మృతురాలు ఆశా (దాదాపు 40 ఏళ్లు) గత సంవత్సరంన్నరగా సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరు దక్షిణ బెంగళూరులోని హులిమావులో అద్దె ఇంట్లో కలిసి ఉంటున్నారు.

గొంతు నులిమి చంపేశాడని తెలిపారు
వీరిద్దరికీ ఇదివరకే విడి విడిగా పెళ్లీళ్లు అయి ఇద్దరు చొప్పున పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే సమాజానికి మాత్రం తాము భార్యాభర్తలమని చెప్పుకున్నారని వెల్లడించారు. ఆశా అర్బన్ కంపెనీలో హౌస్ కీపింగ్ సర్వీసులు చేసేదని, షంషుద్దీన్ భార్యాపిల్లలు అస్సాంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.సౌత్ బెంగళూరు డీసీపీ లోకేష్ బి జగలసర్ వివరాలు వెల్లడించారు. నిందితుడు, బాధితురాలి మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఒకరోజు గొడవ తీవ్రం కావడంతో షంషుద్దీన్ ఆశా (Asha) ను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు. “హత్య చేసిన తర్వాత షంషుద్దీన్ మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి బైక్‌పై తీసుకెళ్లి చెత్త లారీలో పడేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, సీసీటీవీ ఫుటేజీలే కీలక ఆధారాలుగా నిందితుడి ఆచూకీ లభించింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాము. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.” డీసీపీ జగలసర్ వెల్లడించారు.
Read Also: Karnataka CM Post: కర్ణాటక సీఎం మార్పుపై జోరందుకున్న ఊహాగానాలు