తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనంతో ఆనందంగా తిరిగి వెళ్తున్న యాత్రికులకు ఊహించని విషాదం ఎదురైంది. అన్నమయ్య జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన ఓ కుటుంబ బృందం శ్రీవారిని దర్శించుకునేందుకు టెంపో వాహనంలో తిరుమలకు వచ్చింది. దర్శనం అనంతరం తమ స్వస్థలానికి తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్దకి రాగానే, ఎదురుగా వేగంగా వచ్చిన ఓ లారీ, యాత్రికుల టెంపోను బలంగా ఢీకొట్టింది.లారీ ఢీంతో టెంపో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ బీభత్స ఘటనలో ముగ్గురు యాత్రికులు ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాద తీవ్రతతో పలువురు గంభీరంగా గాయపడ్డారు. గాయాలపాలైన 11 మందిని స్థానికులు, పోలీసులు వెంటనే 108 అంబులెన్స్‌ల ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్య సేవలతో పోరాడుతున్న ప్రాణాలు
హాస్పటల్ వర్గాల సమాచారం మేరకు గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బాగేపల్లి వాసులు మదనపల్లెకు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఆధ్యాత్మిక యాత్రలో తీరని విషాదం
శ్రీవారి దర్శనం అనంతరం సంతోషంగా ఇళ్లకు బయలుదేరిన కుటుంబాల్లో ఈ ప్రమాదం కలకలం రేపింది. ఆధ్యాత్మిక యాత్ర అనంతరం మృతిచెందిన విషయాన్ని బంధువులు మింగలేకపోతున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో శోకాన్ని నింపింది.
కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతుంది
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also : electric cycle : సొంతంగా ఈ-సైకిల్ తయారుచేసిన విద్యార్థి