పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో సింగయ్య మృతి చెందిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైన వీడియో అసలైనదేనని, అందులో ఎటువంటి మార్ఫింగ్ జరగలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) తన నివేదికలో స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నివేదిక పోలీసులకు అందడంతో దర్యాప్తులో ఇది అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద సింగయ్య నలిగిపోతున్న దృశ్యాలు సెల్‌ఫోన్‌లో రికార్డయ్యాయి. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత, వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ వీడియో నకిలీదని, జగన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు ఆ వీడియో క్లిప్‌ను, ఘటనా స్థలంలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీడియో రికార్డ్ చేసిన సెల్‌ఫోన్ ఐడీ, అది ఉన్న లొకేషన్ వంటి సాంకేతిక వివరాలను నిపుణులు క్షుణ్ణంగా విశ్లేషించారు. ఆ విశ్లేషణల తర్వాత, ఆ వీడియో ఒరిజినల్ అని, ఎటువంటి ఎడిటింగ్ జరగలేదని ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారించినట్లు సమాచారం.
జులై 1న హైకోర్టులో విచారణ
ఈ కేసులో తన ప్రమేయం లేదని, తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జులై 1న ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. అదే రోజున పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) మొన్న కోర్టుకు అందించారు. పూర్తి సాంకేతిక ఆధారాలు సమర్పించేందుకు గడువు కోరగా, కోర్టు అందుకు అంగీకరించింది. ఈ ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోర్టులో కేసు విచారణలో కీలక పాత్ర పోషించనుంది.
పకడ్బందీగా పోలీసుల దర్యాప్తు
పల్నాడు జిల్లా పోలీసులు ఈ కేసులో మొదటి నుంచీ పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనానికి ఇప్పటికే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేశారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన దాదాపు పది మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ కేసులో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు జగన్‌తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని తదితరులను నిందితులుగా చేర్చారు.
అయితే, ప్రధాన నిందితుడు, కారు డ్రైవర్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి విచారణకు సరిగా సహకరించడం లేదని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారు బానెట్‌పై ఒక కార్యకర్త ఉండటంతో తనకేమీ కనిపించలేదని, అసలు చక్రాల కింద వ్యక్తి పడిన విషయమే తనకు తెలియదని పోలీసుల వద్ద వాదించినట్టు తెలిసింది. స్థానికులు అప్రమత్తం చేసిన తర్వాత కారును వెనక్కి తీసినట్లు వీడియోలో స్పష్టంగా ఉన్నప్పటికీ, డ్రైవర్ తన వాదన మార్చుకోకుండా ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాడని తెలుస్తోంది. పోలీసులు మాత్రం కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి, వాస్తవాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికతో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.
Read also: Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో హై టెన్షన్.. కేతిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు