గద్వాల ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య (Surveyor Murder): షాకింగ్ నిజాలు వెలుగులోకి
జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య Surveyor Murder) కేసు మిస్టరీని గద్వాల ఎస్పీ టి. శ్రీనివాసరావు ఛేదించారు. ఈ కేసులో వెల్లడైన వివరాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. వివాహం జరిగిన నెల రోజులకే తన భర్తను భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు, బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావుతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేయించినట్లు ఎస్పీ తెలిపారు. ఐశ్వర్య తల్లికి కూడా తిరుమల్ రావుతో వివాహేతర సంబంధం ఉందని చెప్పడం ఈ కేసులో మరో దిగ్భ్రాంతికర విషయం.
ఈ నెల 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత నాలుగు రోజులకే, ఈ నెల 21న గాలేరు-నగరి కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. అప్పటినుండి పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా, ఐశ్వర్య, తిరుమల్ రావు కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. వీరిద్దరూ తేజేశ్వర్ (Tejeshwar) కదలికలను తెలుసుకోవడానికి జీపీఎస్ ట్రాకర్ (GPS Tracker) ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, సుఫారీ గ్యాంగ్తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. ముగ్గురు వ్యక్తులు తేజేశ్వర్‌ను (Tejeshwar) కారులో తీసుకెళ్లి, కారులోనే కొడవలితో నరికి చంపినట్లు వెల్లడించారు. హత్య అనంతరం, దొరక్కుండా జాగ్రత్తగా ఉండాలని, హనీమూన్ హత్య ఘటన తరహాలో పథకం వేసుకున్నారని ఎస్పీ తెలిపారు.

హత్య వెనుక ప్రేమాయణం, అక్రమ సంబంధాలు
ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని తిరుమల్ రావు ప్రణాళిక రచించాడు. అందుకే తేజేశ్వర్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన వద్దకు అప్పు కోసం వచ్చిన నాగేశ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హత్య తర్వాత ఐశ్వర్య, తిరుమల్ రావు కలిసి లద్దాఖ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ నిత్యం వీడియోకాల్స్‌లో మాట్లాడుకుంటూ తమ ప్రణాళికలను రచించుకున్నారు.
ఆసక్తికరంగా, తేజేశ్వర్‌తో ఐశ్వర్య వివాహం మొదట రద్దయింది. ఎక్కువ కట్నం అడగడం వల్లే పెళ్లి చేసుకోలేకపోతున్నానని ఐశ్వర్య అబద్ధం చెప్పింది, దాన్ని తేజేశ్వర్ నమ్మాడు. అప్పటికే బ్యాంకు మేనేజర్‌గా ఉన్న తిరుమల్ రావుకు పెళ్లయ్యింది. అయితే, తిరుమల్ రావు (Tirumal Rao) తన భార్యను కూడా హత్య చేయాలని అనుకున్నాడని ఎస్పీ తెలిపారు. హత్య అనంతరం, రక్తపు మరకలున్న దుస్తులను పారవేయడానికి తిరుమల్ రావు కొత్త దుస్తులు కొనిచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఐశ్వర్య, తిరుమల్ రావు, ఐశ్వర్య తల్లితో సహా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆరు నెలల్లోపు నిందితులకు శిక్ష పడేలా ప్రయత్నిస్తామని ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Read also: Road Accident: రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి..