ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని (Capital ) లేకుండా వైఎస్ జగన్ చేశాడంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. “మూడు రాజధానుల తంతుతో రాష్ట్ర అభివృద్ధిని కుంగదీసిన జగన్, అమరావతిని నాశనం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడని” వ్యాఖ్యానించారు. వైసీపీ (YCP) హయాంలో నిధుల దుర్వినియోగం, పెట్టుబడిదారులలో భయాన్ని నెలకొల్పిన తీరు వల్లే రాష్ట్రానికి తీవ్ర నష్టాలు వాటిల్లాయని మండిపడ్డారు. కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రానికి అభివృద్ధి బాటలు తిరిగి కనిపిస్తున్నాయని వివరించారు.
సుపరిపాలనతో నూతన దిశ – లక్ష్యంగా 2047 విజన్
సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సమీక్షా కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధరేశ్వరి, లోకేశ్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత ఏడాది చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్ లక్ష్యాలను చర్చించారు. “స్వర్ణాంధ్ర విజన్ – 2047” లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏ విధంగా పటిష్ట పాలన అందిస్తుందో చూపించామని చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు పార్టీలతో కూడిన ప్రభుత్వం ఉన్నా ఎలాంటి విభేదాలు లేకుండా ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అమరావతికి నూతన జీవం – సంక్షేమానికి శాస్వత బాట
చంద్రబాబు తన ప్రసంగంలో అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని, పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నారు. పోలవరం పూర్తి అయితే నీటి సమస్యలు తీరుతాయని, ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,500 కోట్లు కేటాయించిందన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం పథకం అమలు, రూ.5కు అన్నం అందించే 213 అన్న క్యాంటీన్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్లు సాయం, రైల్వేజోన్ పనుల వేగవంతం వంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. “ఒక్క సంవత్సరం పాలనలోనే ప్రజలకు విశ్వాసం కలిగించగలిగాం, మిగతా కాలంలో అభివృద్ధి పునఃప్రారంభం అయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాల్సిందే” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also : YCP : రాజకీయాలు దిగజారిపోతున్నాయంటూ బొత్స కామెంట్స్