ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్ట్ శ్రీశైలం(Srisailam Project) ప్రస్తుతం పెనుప్రమాదంలో ఉంది. డ్యామ్ పునాదుల కింద భూగర్భంలో భారీ రాతిఫలకాల మధ్య పెళుసుతో కూడిన అతుకులు ఉన్నట్లు జియాలాజికల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే విషయాన్ని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎస్ ఏ) నిపుణుల కమిటీ ఏడాది క్రితమే తేల్చింది. జలాశయం కింద భూగర్భంలోని రాతిఫలకాల మధ్య అతుకులున్నాయని, అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యామ్ పునాదులు రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
డ్యామ్ దిగువన ఏర్పడిన భారీ గొయ్యి 120 మీటర్ల లోతు ఉందని, డ్యామ్ పునాదుల కన్నా కిందకు ఆ గుంత విస్తరించి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. జలాశయం భద్రత దృష్ట్యా తక్షణమే తగిన అధ్యయనాలు చేసి, మరమ్మతులకు ఉపక్రమించాలని సిఫారసు చేసింది. శ్రీశైలం జలాశయం దిగువన డైక్/కాఫర్ డ్యామ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉంటుంది. భారీ గొయ్యికి రెండు వైపులా రాతిఫలకాలకు బోల్టులు అమర్చి కాంక్రీట్‌తో రీఎన్‌ఫోర్స్ చేయాలని నివేదికలు రూపొందించారు.

గొయ్యి పరిమాణం మరింత పెరగకుండా జలాశయం గేట్ల నిర్వహణలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సిఫారసులు చేశారు. ఎగువన ఎడమ గట్టుకు రక్షణగా నిర్మించిన గోడ, పియర్, స్పిల్‌వే ఎగువ భాగానికి మరమ్మతు చేపట్టకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. 17/18 బ్లాకులకు రెండో చోట్ల అడ్డంగా వచ్చిన పగుళ్లకు మరమ్మతు చేయాల్సి ఉంది.
డ్యామ్ దిగువన 4, 9,10 నంబర్ల గేట్ల వద్ద ఏర్పడిన గుంతల లోతును అధ్యయనం చేసి, దాని ఆధారంగా మరమ్మతులను నిర్వహించాలి. 16,17వ బ్లాకుల వద్ద ఏర్పాటు చేసిన రివర్స్ స్లూయిసల నుంచి లీకేజీని అరికట్టడానికి అత్యంత ప్రాధాన్యతతో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. డ్యామ్ ఫౌండేషన్ గ్యాలరీలో అందోళనకర రీతిలో సీపేజీ జరుగుతోందని, డ్యామ్ బ్లాకులను 45 భాగాలుగా విభజించి సీపేజీని అంచనా వేయాలని నిపుణులు చెబుతున్నారు.
సీపేజీ అధికంగా ఉన్న బ్లాకులకి కర్టెన్ గ్రౌటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రైయిన్ రంధాల నుంచి పూడిక తొలగించి సీపేజీ నీళ్లు బయటకి వెళ్లే ఏర్పాట్లు చేయాలి. పూడిక తొలగింపు సాధ్యం కాని పక్షంలో అత్యంత జాగ్రత్తగా కొత్త రంధ్రాలు వేయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. భూకంపాల ముప్పు, ప్రాజెక్టుకు వచ్చే వరదపై మళ్లీ అధ్యయనాలు చేపట్టాల్సి ఉంటుంది.
కాగా శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని నెలాఖరులోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎసఏ) ఆదేశించింది. దీనితో ప్రత్యేక నిపుణుల బృందం తాజా మరోసారి డ్యాం పరిస్థితులను అంచనా వేశారు. మరమ్మత్తులు వెంటనే చేపట్టకపోతే భారీ నష్టం కలిగే ప్రమాదం ఉంది.
శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం 1963లో ప్రారంభమై 1984 నాటికి పూర్తి చేసుకుని వినియోగంలోకి వచ్చింది. 1975 -76లో జలాశయం దిగువన బకెట్ ఏరియాలో కోతకు గురైనట్లు గుర్తించి నిపుణుల కమిటీ ఊన మేరకు రక్షణగా అప్రాన్ ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితం కనిపించలేదు.
శ్రీశైలం జలాశయాన్ని గరిష్టంగా 19 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిర్మించగా 2009లో భారీగా వరదలు డ్యామ్‌ను తాకాయి. సుమారు 25.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి పోటెత్తింది. గరిష్ట నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, వరదల సమయంలో 273.25 మీటర్లకు పెరిగిపోవడంతో జలాశయం పొంగిపొర్లింది.
78 గంటల పాటు భీకర వరద కొనసాగడంతో జలశయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. గంత కారణంగా జలాశయం పునాదుల కింద రాతిపొరల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి ఆధునిక పద్ధతుల్లో సిమ్యూలేషన్ అధ్యయనాలు చేయాలి. వేర్వేరు వరద తీవ్రతలను ప్రామాణి కంగా తీసుకుని జలాశయానికి ఉండే ముప్పును, స్థిరత్వాన్ని, జారిపోయే ప్రమాదాలను నివారించాల్సి ఉంటుంది..

శ్రీశైలం దిగువన మరో పెద్ద బహుళార్ధసాధక నీటిపారుదల ప్రాజెక్టు నాగార్జునసాగర్ ఉంది. శ్రీశైలం వద్ద విపత్తు సంభవించినప్పుడు ప్రభావితమయ్యే అనేక పట్టణ సముదాయాలతో పాటు కృష్ణ నది ఒడ్డున వందలాది గ్రామాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తన కొత్త రాజధాని అమరావతి స్థలంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది.
స్పష్టంగా, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలంలో రాబోయే విపత్తు వల్ల భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంది. శ్రీశైలం డ్యామ్‌కు ఏదైనా ముప్పు వాటిల్లితే దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. డ్యామ్ ఫౌండేషన్ గ్యాలరీలో ఆందోళనకర రీతిలో పెద్ద మొత్తంలో సీపేజీ జరుగుతోందని, వీటిని అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే శ్రీశైలం ప్రాజెక్ట్‌లను సంరక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.