తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లో (SC Gurukul educational institutions
) భద్రతను మరింత బలపర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 268 ఎస్సీ గురుకుల స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలను (CCTV Camera) ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో స్కూలులో అవసరాన్ని బట్టి 20 నుంచి 30 వరకు కెమెరాలు అమర్చనున్నారు.
AI టెక్నాలజీతో అధునాతన కెమెరాలు
ఈ కెమెరాలు సాధారణ సీసీ కెమెరాలు కాకుండా, అధునాతన హై రిజల్యూషన్‌తోపాటు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ కలిగి ఉంటాయి. విద్యార్థుల కదలికలు, భద్రత, ఆహారాల నాణ్యత వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది. విద్యార్థుల మానసిక, శారీరక భద్రతపై ఎటువంటి హానికర సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ ముందస్తు చర్య తీసుకున్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ
ఈ కెమెరాల ఫీడ్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు. హైదరాబాద్‌లోని ఎస్సీ గురుకుల సొసైటీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని అన్ని గురుకులాల పనితీరు, భద్రతా పరిస్థితులను రియల్ టైమ్‌లో నిఘా పెట్టవచ్చు. విద్యార్థుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో అభినందనీయంగా మారుతోంది.
Read Also : Kutami Govt : నేడు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం