కోవిడ్ మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది
కోవిడ్(Coronavirus) మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించేలా చేస్తోంది. ఐదేళ్ల క్రితం తీవ్ర ప్రభావం చూపిన కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ వేర్వేరు వేరియంట్లతో వ్యాపిస్తూనే ఉంది. ప్రస్తుతం వైద్యరంగంలో చికిత్స, వాక్సిన్లు అందుబాటులోకి రావడంతో త్వరగానే కరోనా నుంచి రోగులు ఉపసమనం పొందుతున్నారు. మళ్లీ ప్రస్తుతం భారత్లో కొత్త వేరియేషన్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజలు మళ్ళీ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కేసుల పెరుగుదల గమనించబడుతోంది
సుమారు రెండు నెలల క్రితం కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా కరోనా(Coronavirus)కేసులు వెలుగు చూశాయి. అనంతరం క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. ముందుగా కేవలం పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం వేల సంఖ్యకు చేరాయి. అందుతున్న అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి రోజు సుమారు 6 వందల నుంచి వెయ్యి మంది వరకు కరోనా బారిన పడుతున్నారు. మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ మరోసారి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితలు కనిపిస్తున్నాయి. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్తో పాటు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉంటోంది.

కరోనా ఆరోగ్యపరమైన ప్రభావాలు
కరోనా(Coronavirus) వల్ల శరీరంలో వివిధ అవయవాల పైన ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో వచ్చిన కరోనా చాలామందిని గుండెపోటుకు గురయ్యేలా చేస్తోంది. వీటివల్ల చాలామంది మరణించారు. ముఖ్యంగా యువత ఎక్కువగా గుండెపోటుకు గురౌతున్నారు. దీనికి కారణంగా గతంలో కరోనా సోకడం కూడా ఒక కారణంగా పరిశోధనల్లో తేలింది. కొందరికి ఊపరితిత్తులు, కర్ణభేరి, నరాలు వంటివి దెబ్బతిన్నాయి. మరికొంతమందికి కిడ్నీలపై కూడా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
కోవిడ్ లక్షణాలు
కరోనా వైరస్ వ్యక్తి శరీర ప్రతిస్పందనను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి అధిక సమస్యలు కలిగిస్తోంది. జ్వరం, గొంతుమంట, ముక్కు దిబ్బడ, వాసన, రుచి కోల్పోవడం, శరీర నొప్పులు, తలనొప్పి, ఛాతిలో ఒత్తిడి, పొడి దగ్గు వంటివి సాధారణ లక్షణాలు కరోనా సోకినప్పుడు కలుగుతుంటాయి.
తీవ్రమైన లక్షణాలు
ఇక తీవ్రమైన లక్షణాల విషయానికి వస్తే.. శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి సమస్య, చర్మం రంగు మారడం, గుండెలో తీవ్రమైన నొప్పిగా అనిపించడం వంటివి కలుగుతుంటాయి.
శరీరవ్యవస్థపై కోవిడ్ ప్రభావం
కోవిడ్ వైరస్ మొదటిగా శ్వాస కోస వ్యవస్థపైన దాడి చేస్తుంది. ఆ తర్వాత ముక్కు, నోరు, కళ్ల ద్వారా ప్రవేశించి ఊపిరితిత్తుల వరకు చేరుతుంది. అప్పటి నుంచి శ్వాస కోసం ఇబ్బందులను కలిగించేలా చేస్తుంది. దీనివల్ల న్యుమోనియా, హైపోక్సియా వంటి సమస్యలను తీసుకువస్తుంది. కోవిడ్ వైరస్ రక్తంలో ప్రవేశించిన వెంటనే రక్తం గడ్డ కట్టి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గుండెకు రక్తనాళాలలో గడ్డ కట్టడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నరాల, జీర్ణవ్యవస్థపై ప్రభావం
కరోనా వైరస్ వల్ల ఎక్కువగా నరాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, రుచి, వాసన కోల్పోవడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలిక మెమోరీలాస్ వంటివి కూడా ఏర్పడతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇక జీర్ణవ్యవస్థపైన ప్రభావం కారణంగా వాంతులు, విరేచనాలతో పాటు ఆకలి తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. అలాగే కాలేయం వంటి వాటిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కోవిడ్ తీవ్ర రూపంలో ఉంటే కచ్చితంగా కిడ్నీల పనితీరుపైన ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. ఇక కీళ్లనొప్పులు దీర్ఘకాలికంగా ఉండవచ్చు.
జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం
కరోనా సోకిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ఆ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు పేర్కొంటున్నారు. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి. బయట విక్రయించే ఆహార పదార్థాలను తీసుకోకుండా ఇంట్లో వండిన భోజనాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా రెండు మూడు సార్లు సబ్బు రాసి కడుక్కోవాలి. వీలైనంత ఎక్కువగా పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. స్వల్ప వ్యాయామాన్ని ప్రతిరోజూ చేయడానికి ప్రయత్నించాలి. వీలైతే సుమారు అరగంటకు తక్కువ కాకుండా ఉదయం పూట నడకను కొనసాగించాలి. మద్యపానం, ధూమపానం, గుట్కాల సేవనం వంటి వాటికి దూరంగా ఉండాలి.
పరీక్షలు మరియు చికిత్స
కరోనాకు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేసుకోవాలి. ప్రస్తుతం ప్రతి మెడికల్ షాపులో కోవిడ్ టెస్ట్ కిట్లు లభిస్తున్నాయి. వీటి ద్వారా తమకు సోకింది సాధారణ వైరసా, లేక కోవిడ్ వచ్చిందా? అన్న నిర్ధారణ చేసుకోవాలి. కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. కోవిడ్ సోకితే ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. వీలైతే రెండు రోజులు సాధారణ దైనందిన జీవితాన్ని పక్కన పెట్టి గదిలో పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి.
తగిన జాగ్రత్తలు మరియు అవగాహన అవసరం
కరోనా వచ్చిందని తేలితే ఆందోళనకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం కరోనా వేరియంట్లు అంత ప్రభావం కలిగి ఉండటం లేదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే రెండు మూడు రోజుల్లోనే వైరస్ బారి నుంచి బయటపడవచ్చు. ఏమాత్రం ఆందోళన అవసరం లేదు. అలాగని అజాగ్రత్తగా ఉండటం కూడా సరికాదు.
Read Also: Social media:హద్దులు మీరుతున్న సోషల్ మీడియా