అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day) పురస్కరించుకుని విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం సమీక్షించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ భరత్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను ఒక విశిష్ట కార్యక్రమంగా మలుస్తోందని, దీనివల్ల దేశ దృష్టి ఏపీ వైపు మళ్లిందని ప్రధాని ప్రశంసించారు.ఆంధ్రా నేతలు కలసికట్టుగా పనిచేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం చరిత్ర సృష్టించనుందని, లక్షలాదిమంది యోగా ప్రాక్టీస్ చేస్తుండటం స్ఫూర్తిదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉత్సాహంగా ముందుకు రావడం దేశానికి గర్వకారణమని తెలిపారు.
విశాఖలో ఘన స్వాగతం
శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. అనంతరం మోదీ ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి, అక్కడి నుంచి నౌకాదళ అతిథిగృహానికి చేరారు. ఆయన శుక్రవారం రాత్రి అక్కడే బస చేస్తారు.
రికార్డు స్థాయి యోగాసనాల ప్రదర్శనకు సన్నాహాలు
జూన్ 21 ఉదయం, విశాఖ ఆర్కే బీచ్ వద్ద జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన యోగాసనాలు కూడా చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజల్లో యోగాపై అవగాహన పెంచేందుకు ఈ ప్రోగ్రామ్ కీలకమవుతుంది. ఉదయం 11:50కు ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.
భద్రతా ఏర్పాట్లతో నగరం అప్రమత్తం
ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. బీచ్ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణతో పాటు, కీలక ప్రదేశాల్లో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అధికారులు ఆశిస్తున్నారు.
Read Also : Yoga Andhra : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ… స్వాగతం పలికిన చంద్రబాబు