ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) పది రోజుల ముందే ప్రవేశించినప్పటికీ, ఆరంభంలోనే భారీ వర్షాలు కురుస్తాయని ఆశపడ్డ రైతులకు నిరాశే ఎదురైంది. మే నెల చివర్లోనే కొన్ని జిల్లాల్లో వర్షం కురవడంతో రైతులు జూన్ మొదటివారంలోనే పొలాల్లో విత్తనాలు వేసేందుకు ముందుకొచ్చారు. కానీ, ఆ తర్వాత వర్షాలు కరువయ్యాయి. మబ్బులు కనిపిస్తున్నా, వాన మాత్రం పడకపోవడంతో పొలాల్లో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పెరిగిన ఉష్ణోగ్రతలు, తగ్గిన వర్షాలు:
ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు, చంద్రుగొండ మండలాల్లో అధికంగా, టేకులపల్లి, సుజాతనగర్, అశ్వాపురం మండలాల్లో సాధారణ వర్షపాతం సంభవించింది. మిగతా 18 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయింది. జూన్ 1 నుంచి 18 నాటికి జిల్లావ్యాప్తంగా సాధారణ వర్షపాతం 89.20 మి.మీ నమోదు కావాల్సి ఉంది. కానీ కేవలం 43.40 మి.మీ. వర్షం కురిసింది. గతేడాది జూన్ మాసంలో సగటు కంటే ఎక్కువగా 227.60 మి.మీ. వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
అతిచిన్న వర్షాలు – అతిపెద్ద నష్టాలు:
కరకగూడెం మండలంలో సాధారణ వర్షపాతం 97.30 మి.మీ. కాగా, ఇప్పటివరకు 2.30 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. గుండాలలో 74.40 మి.మీ.కు 10.30 మి.మీ. కురవగా, పినపాకలో 96.70 మి.మీ.కు 13.30 మి.మీ. వర్షం నమోదు అయింది. మిగతా మండలాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి.
రైతుల పోరాటం –
వర్షం పడకపోవడంతో బోర్లు ఉన్న రైతులు మోటార్ పంపులతో పంటలను నీరుపోస్తున్నారు. తదితర మండలాల్లోని రైతులు తొలకరి వర్షాలకు మొక్కజొన్న, పత్తి, పెసర విత్తనాలు నాటారు. అవన్నీ మొలకలు వచ్చాయి. వర్షాలు ముఖం చాటేయటంతో మొక్కలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. బోర్లు, మోటార్లున్న రైతులు పొలాలను తడిపేందుకు స్ప్రింక్లర్లను వాడుతున్నారు. ఏ సౌకర్యం లేని రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తేనే పంటలకు ప్రాణం అన్నట్లుగా పరిస్థితులు మారాయి.
కరవు ముంచుకొచ్చేనా?
వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, రుతుపవనాల ముందస్తు రాక కచ్చితంగా వర్షాల అవకాసాన్ని సూచించదు. ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు వచ్చేంతగా పరిస్థితులు మారిపోయాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలం జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఉంటుంది. జూన్లో కురవాల్సిన వర్షపాతం కంటే లోటు ఎక్కువగా నమోదు అయింది. ఇది అలాగే కొనసాగితే కరవు పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశాలు అధికం అవుతున్నాయి. వర్షాధార పంటలపై ప్రభావం పడుతుంది. రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
పంటల సాగులో తగ్గుదల:
వర్షాభావం వల్ల ఈ సీజన్‌లో పంటల సాగు కూడా తగ్గిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో పత్తి – 48,076, వరి -183, మొక్కజొన్న – 659, పెసర – 44 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది ఇదే సమయానికి వరి -1,175, పత్రి – 77,878, మొక్కజొన్న – 594, కంది – 490 ఎకరాల్లో సాగయ్యాయి. మరోవైపు జులై చివరి నాటికి విత్తనాలు విత్తుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వ్యవసాయ శాఖ సూచనలు:
ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటలవైపు దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే జూలై చివరి వరకు విత్తనాలు వేయవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.