ఇటీవల కాలంలో మళ్లీ రోడ్డు ప్రమాదాలు(Road accidents) పెరిగిపోయాయి. కరోనా తరువాత కొంత కాలం వరకు ప్రమాదాల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే ప్రస్తుతం పూర్తిగా మూడవ వేవ్ ప్రభావం తగ్గిపోవడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. దీనికి అనుగుణంగానే ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాల్లో గాయపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది.
రోడ్డు విస్తరిస్తున్న కొద్దీ ప్రమదాల సంఖ్య కూడా దానికి అనుగుణంగా పెరుగుతూ వస్తోంది. రోడ్డు ప్రమాదాల(Road accidents) నివారణపై అనేక అధ్యయనాలు జరిగాయి. నిపుణులైన ఇంజనీర్లు పరిశీలన జరిపి అనేక సూచనలు చేశారు. వీటిలో ప్రధానమైనది రోడ్డు నిర్మాణంలో లోపాలు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో కనీసం 20 కిలోమీటర్లకు ఒక ప్రాంతంలో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉంటోంది. డ్రైవర్లు అప్రమత్తంగా ఉన్నా ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు దారితీసే విధంగా రోడ్డు నిర్మాణం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ రహదారిలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు(Road accidents) జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఈ రోడ్డు నిర్మాణంలో లోపాలేనని తేల్చారు. దీనితో కొన్ని ప్రాంతాల్లో మరమ్మత్తు చర్యలు చేపట్టి కొంతవరకు ప్రమాదాలను అరికట్టారు. అయినా ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ రహదారిలో కూడా కొన్ని ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వాహన చోదకులు వాటిని చూడకుండా వేగంగా దూసుకువెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
కృష్ణాజిల్లాలో గౌరవరం వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు ఒక్కసారిగా మలుపు తిరగడం, కొన్ని ప్రాంతాల్లో రోడ్డు ఒక్కసారిగా కిందకు దిగడం, రహదారి వెడల్పు తగ్గడం వంటి అనేక కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో 45 ప్రాంతాలు ప్రమాదాలకు దారితీస్తున్నట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా శివారు ప్రాంతాల్లో కూడా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు నిర్మాణంలో తగిన శ్రద్ధ చూపిస్తే ప్రమాదాలు జరగకుండా ప్రయాణం సాగే విధంగా చర్యలు తీసుకోవచ్చు.
రోడ్డు నిర్మాణం సమయంలో భూసేకరణ సమయంలోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు, బడా స్వాములు తమ భూములకు నష్టం కలగకుండా ఉండేందుకు భూసేకరణకు అడ్డుకుంటారు. వీరి వత్తిడిలకు తలొగ్గిన ప్రభుత్వాలు, అధికారులు రోడ్డును ఆయా భూముల మీదుగా వెళ్లకుండా మలుపులు తిప్పుతూ నిర్మాణం సాగిస్తారు.
ఇలాంటి ప్రాంతాలు మృత్యుకుహరాలుగా మారి నిత్యం రక్తమోడుతుంటాయి. ప్రతి నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ శివారు ప్రాంతంలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
బడా బాబుల భూముల మీదుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒక సమస్య అయితే, మరికొందరి భూముల ధరలు పెరగడానికి వాటికి సమీపంలో నుంచి రోడ్డును తీసుకువెళ్లడం మరో సమస్యగా మారింది. ధనవంతుల కోసం రింగురోడ్డు గింగిరాలు అన్న శీర్షికలతో మీడియా హోరెత్తించినా పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు.

ప్రస్తుతం అవుటర్ రింగు రోడ్డు హైదరాబాద్వాసులకు ఒక వరంగా ఉన్నప్పటికీ రోడ్డు ఇష్టారాజ్యంగా మలుపులు తిప్పుతూ నిర్మాణం జరగడం వల్ల ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. రింగు రోడ్డుపై కొన్ని ప్రాంతాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.
వాతావరణ మార్పులు కూడా ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. నదులు, చెరువులు వంటి వాటి పక్క నుంచి రోడ్డు నిర్మాణం సమయంలో కూడా సరైన నాణ్యత పాటించకపోవడం వల్ల త్వరగా రోడ్డు దెబ్బతింటుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు రోడ్డు కుంగిపోవడంతో అతివేగంతో వస్తున్న వాహనాన్ని అదుపు చేయడంలో డ్రైవర్లు విఫలం అవుతుంటారు. ఈ కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి.
రోడ్డు నిర్మాణం సమయంలో అవినీతి ఎక్కువగా చోటు చేసుకున్నప్పుడు ఆయా రోడ్లు ఆశించిన నాణ్యతతో నిర్మాణం జరగక త్వరగా దెబ్బతింటాయి. ఇంజనీరింగ్ నిపుణుడు సుబ్బరామిరెడ్డి పలు రోడ్లను పరిశీలించి గతంలో ఒక నివేదికను ఇచ్చారు. అంతే కాకుండా ఆయన రోడ్డును పరిశీలించి అందులో నిర్మాణ లోపం ఏమేరకు ఉందో అంచనా వేయడం కూడా జరిగేది.
వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఆయన ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకుని అవకతవకలకు కారణమైన పలువురు అధికారులపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఒక దశలో రాజకీయ వత్తిడి పెరగడంతో ఇలాంటి తనిఖీలను అటకెక్కించారు.
దీనితో రోడ్డు నిర్మాణం సమయంలో ప్రస్తుతం నాణ్యతను అంతగా పాటించడం లేదన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతి, నిర్లక్ష్యం, వత్తిడిలకు లొంగుబాటు వంటి అనేక కారణాల వల్ల లోపభూయిష్టంగా నిర్మించిన రోడ్లు అమాయకుల ప్రాణాలు హరిస్తున్నాయి.
తమ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ విషయంలో సీనియర్ అధికారులు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి లోపాలు లేని రోడ్లు నిర్మిస్తే రోడ్డు ప్రమాదాలను సుమారు 50 శాతం వరకు నియంత్రించే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఏయే రోడ్లు ప్రమాదాలకు నెలవుగా ఉన్నాయన్న వివరాలు తెలిపే నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. అటకెక్కించిన ఈ నివేదికల దుమ్ము దులిపి పరిశీలన జరిపితే ప్రమాదాల రహిత రోడ్లను ఏర్పాటుచేసుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Also: environment: ప్రమాదంలో పర్యావరణం