మారుతున్న జీవన విధానాలు పర్యావరణాన్ని(environment) ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి. పెరుగుతున్న పట్టణ, నాగరికత వ్యవస్థ, అడవుల విధ్వంసం, పెరుగుతున్న కాలుష్యం, అటవీభూముల ఆక్రమణలు వంటి అనేక విషయాలు పర్యావరణానికి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. దీని ప్రభావం వల్ల కొన్ని సంవత్సరాలకు మానవుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రహదారులు అటవీ ప్రాంతాల మీదుగా నిర్మించడం, మైదాన ప్రాంతాల నుంచి రాజకీయ వత్తిడితో అటవీ భూముల ఆక్రమణలు వేగవంతంగా జరుగుతున్నాయి. మరోపక్క పోడు వ్యవసాయం మరింతగా నష్టం కలిగిస్తోంది. ఆదివాసీలకు అండగా ఉంటామని కొందరు స్వార్థపరులు ఉద్యమాలు చేసి ఆ భూములను కాజేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఎవరు అధికారంలోకి వస్తే వారు సాధ్యమైనంత వరకు భూముల ఆక్రమణలపై దృష్టిసారిస్తున్నారు. దీనివల్ల ఒక పక్క అటవీ ప్రాంతాల విస్తీర్ణం తగ్గుముఖం పట్టడంతో ఈ ప్రాంతాల్లో నివసించే ఆమాయలకులైన ఆదివాసీలు, గిరిజనుల జీవనం దుర్భరంగా మారుతోంది. మరోపక్క పర్యావరణం(Environment)దెబ్బతినడంతో అసహజ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

గత రెండు దశాబ్దాలుగా వాతావరణ పరిస్థితిని సమీక్షిస్తే మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రారంభ దశలో ఉన్న ఈ పరిస్థితులను కట్టడి చేయకపోతే ఈ శతాబ్దం అంతానికి మానవాళి ప్రశాంతంగా నివసించే పరిస్థితులు ఉండబోవని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా గత రెండేళ్లుగా పరిశీలిస్తే విపత్తులు ఏ విధంగా దేశాన్ని ఇబ్బందిపెడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రతిఏటా రికార్డు స్థాయిలో వరదలు, తుఫాన్లు చుట్టుముడుతున్నాయి. దీనితో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. వేలాది మంది ప్రజలు, పశువులు మృత్యువాతపడుతున్నారు.
ఈ సంవత్సరంలో కోనసీమ జిల్లాలో కురిసిన వర్షాలు తాము ఎన్నడూ చూడలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు లంక గ్రామాలు ముంపునకు గురికావడం తమకు సాధారణ విషయమే గాని ఈసారి వరుసగా మూడుసార్లు కుండపోత వర్షాలు, వరదలు రావడం నెల రోజులకి పైగా తాము ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవడం మాత్రం ఇదే మొదటిసారి అని వారు చెబుతున్నారు.
వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 242 భీతావహ ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. అమెరికా, చైనా తరువాత అత్యధికంగా విపత్తులు ఎదుర్కొన్న దేశంగా భారత్ మూడో స్థానంలో ఉంది.
గత రెండు దశాబ్దాల్లో మన దేశంలో విపత్తుల కారణంగా వంద కోట్ల మంది ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. దాదాపు 90 వేల మంది ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 13 లక్షల కోట్ల మేర నష్టం జరిగింది.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నష్టం కలిగింది. నదీపరీవాహక ప్రాంతాల్లో వరదలు తీవ్రమయ్యాయి. సముద్రం కొన్ని వందల కిలోమీటర్లు చొచ్చుకువచ్చి భూభాగాన్ని చుట్టుముట్టింది.
హైదరాబాద్‌లో గత సంవత్సరంలో కురిసిన రికార్డుస్థాయి వర్షాలకు అనేక కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. మూసీ నది సైతం తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది.
వందేళ్లలో మూసీ ఈ మేరకు ప్రవహించలేదని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు చెన్నయ్, బెంగళూరు, ముంబయి నగరాలు సైతం ఈసారి భారీ వర్షాలను చవిచూశాయి.
విద్యాసంస్థలు సైతం మూసి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ఈసారి పరిధికి మించి వర్షాలు నమోదు అయ్యాయి.

నగరాల్లో చెట్ల పెంపకం గణనీయంగా తగ్గిపోయింది. కాంక్రీట్ జంగిల్‌గా నగరాలు మారిపోతున్నాయి. ప్రతి సంవత్సరం కురుస్తున్న వర్షాలు పెరుగుతూ వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లు వర్షాకాలం పూర్తయ్యేనేగా కాని నిండేవి కావు. కొన్ని 80 శాతం మాత్రమే నిండేవి. అయితే ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది.
జూన్‌లో కురిసిన వర్షాలకే రిజర్వాయర్లు నిండిపోయాయి. దీనితో మళ్లీ మూడు దఫాలుగా వర్షాలు కురవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలారు.
దీనివల్ల అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసింది. భద్రాచలం వంటి నగరానికి సైతం వరద ముప్పు వాటిల్లింది.
ఎన్నడూ లేని విధంగా నీరు తమ ప్రాంతాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్న ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఇంతకంటే హెచ్చువర్షపాతం ఉంటుందని సమాచారం.
ఈ పరిస్థితులు రావడానికి కేవలం పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు వాస్తవ పరిస్థితులు గ్రహించకపోతే మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
సామాజిక అడవులు పెంపుదలలో మరింత కృషి అవసరం. ఇళ్లలో చెట్ల పెంపకం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. రోడ్ల విస్తరణ, బహుళ అంతస్తుల నిర్మాణం పేరుతో నిత్యం వేలాది చెట్లను నరికివేస్తున్నారు.
ఓట్ల రాజకీయంతో ముడిపెట్టి ఆక్రమణలను పట్టించుకోవడం లేదు. కొందరు అధికారులు కూడా అవినీతికి పాల్పడుతూ ఆక్రమణలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు.
ప్రభుత్వంలోను, ప్రజల్లోను పర్యావరణం పట్ల చైతన్యం వస్తేనే భావితరాలు విపత్తుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది.