ఈశాన్యం తగ్గించే స్థలాలను కొనగూడదు. ఇటువంటి స్థలాలను స్వంతం చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా అభివృద్ధి కుంటుపడుతుంది. వంశాభివృద్ధి క్షయమవుతుంది. దికమూఢం ఏర్పడిన స్థలం ఇంటి నిర్మాణానికి పనికిరాదు.
మన పొరుగున వున్న స్థలం తూర్పు దిశ నుండిగానీ, ఉత్తర దిశనుండిగానీ వర్షపు నీరు మన స్థలంలోకి పారకుండా జాగ్రత్త పడాలి. వాళ్ల వాడకం నీళ్లు కూడా మన స్థలంలోకి రాకూడదు.
రెండు విశాలమైన స్థలాల మధ్య లభించే ఇరుకైన స్థలాలు మంచి ఫలితాలను ఇవ్వవు. స్థలం ఈశాన్యంగా ఎంత చొచ్చుకుపోతే అంత మంచిదే. కానీ ఇతర మూలల్లో చొచ్చుకుపోయిన స్థలాలు మంచివి కావు. అలాంటి స్థలాన్ని కొనకపోవడం ఉత్తమం.
పడమర వాయువ్యం పెరిగిన స్థలం, పడమర నైరుతి పెరిగిన స్థలం, ఉత్తర వాయువ్యం పెరిగిన స్థలం, దక్షిణ నైరుతి పెరిగిన స్థలం, తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలం, దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలాలు కూడా కొనకపోవడం మంచిది.
మీరు ఎన్నుకున్న స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి నుండి వీధిలోకి నడిచే మార్గం మిమ్మల్ని తూర్పు, ఉత్తర, ఈశాన్యం వైపుకు నడిపించినా — అది అత్యుత్తమమైన స్థలంగా భావించవచ్చు.
ఆ విధంగా కాకుండా తూర్పు ఆగ్నేయానికిగానీ, నైరుతి వైపుకుగానీ, ఉత్తర వాయువ్యం వైపుకుగానీ నడుస్తూ వీధిలోకి వెళ్లవలసి వస్తే — ఆ స్థలం సరైంది కాదని గుర్తించాలి.
పడమర, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యం గుండా నడుస్తూ వీధిలోకి రావడం కూడా శ్రేష్ఠమైన స్థలానికి సంకేతం. ఇలా ఉత్తమమైన దారుల గుండా వీధిలోకి వచ్చే అవకాశం ఉన్న స్థలాలను ఎన్నుకుని గృహ నిర్మాణం చేసుకుంటే తరతరాలు సుఖజీవనం చేయవచ్చు.

కొనకూడని మరికొన్ని స్థలాలు:
త్రిభుజాకార స్థలం:
మూడు భుజాలు కలిగిన స్థలం పనికి రాదు. ఇలాంటి స్థలంలో ఇల్లు కట్టుకొని నివసించేవారు గానీ, వ్యవసాయం లేదా వ్యాపారం చేసేవారు గానీ శత్రుభీతికి లోనవుతారు.
విషమబాహు స్థలం:
స్థల భుజాలు హెచ్చు తగ్గులు కలిగివుంటే, స్థలానికి నాలుగు కంటే ఎక్కువ మూలలు గానీ భుజాలు గానీ ఉన్నా, లేదా నాలుగు భుజాలే ఉండి అవి అసమంగా ఉంటే — అటువంటి స్థలాన్ని విషమబాహు స్థలం అంటారు. ఇలాంటి స్థలంలో నివసించే వారు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు.
భద్రసనాకార స్థలం:
దీర్ఘచతురస్రాకారంగా ఉండి, నాలుగు మూలలూ 90 డిగ్రీలలో ఉండే స్థలం. ఇది శ్రేష్ఠమైనదే కానీ నివాస గృహ నిర్మాణాలకు మాత్రం అనుకూలం కాదు.
దండాకార స్థలం:
స్థలం పొడవుగా ఎక్కువగా ఉండి, వెడల్పు, భుజాలు అసమంగా ఉండే స్థలాన్ని దండాకార స్థలం అంటారు. ఇది పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.

వృత్తాకార స్థలం:
ఈ స్థలం విశిష్ఠమైనదే కానీ సాధారణ గృహ నిర్మాణాలకు అనుకూలం కాదు. ప్రత్యేక కట్టడాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. వృత్తాకార స్థలంలో చతురస్రాకారంగా లేదా దీర్ఘచతురస్రాకారంగా కట్టడం మంచిది కాదు.
చక్రాకార స్థలం:
సంపూర్ణ వృత్తాకారంగా కాకుండా గుండ్రంగా కనిపించే స్థలం. ఇలాంటి స్థలంలో నివసించే వారు ధననాశనానికి గురై బీదరికానికి దారి తీస్తారు.
డమరుక ఆకార స్థలం:
త్రినేత్రుడి చేతిలో ఉండే డమరుకం ఆకారంలో ఉండే స్థలం. ఇలాంటి స్థలంలో నివసించే వారికి నేత్ర సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అండాకార స్థలం:
కోడిగుడ్డు ఆకారంలో లేదా తాబేలు చిప్ప ఆకారంలో కనిపించే స్థలం. ఇలాంటి స్థలం కొంటే దానిని విక్రయించడం లేదా వదిలించుకోవడం కష్టం. స్థల యజమాని నిరంతరం మానసిక ఒత్తిడిలో ఉంటారు.
శకటాకార స్థలం:
బండి ఆకారంలో ఉండే స్థలం. ఇలాంటి స్థలంలో నివసిస్తే లేదా వ్యాపారం చేస్తే దారిద్ర్యం వైపే దారి తీస్తుంది.
కుంభాకార స్థలం:
ఇలాంటి స్థలంలో నివసించేవారికి చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది.
రోకలి ఆకార స్థలం:
ఒకవైపు అర్ధ వృత్తాకారంగా పొడవుగా సాగిన స్థలం. ఇలాంటి స్థలాల్లో నివసించేవారు బంధువులను కోల్పోవటం, సంపదను నాశనం చేసుకోవటం జరుగుతుంది.
చేట ఆకార స్థలం:
చెరిగే చేట ఆకారంలో ఉండే స్థలం. ఇలాంటి స్థలం కలిగి ఉన్నవారు ఎప్పుడూ టెన్షన్ లో ఉంటారు, సంపదను కోల్పోతారు.
అర్ధచంద్రాకార స్థలం:
ఇలాంటి స్థలంలో నివసించే వారు తరచూ దోపిడీ భయంతో కృశించిపోతారు.
ముగింపు:
గృహ నిర్మాణాలకు చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారం స్థలాలే అత్యుత్తమమైనవి. ఈశాన్యం పెరుగుదల కాస్త ఎక్కువగా కనిపించేందుకు వాయువ్యం లేదా ఆగ్నేయ మూలల్లో ఎక్కువ స్థలాన్ని వదిలివేయాల్సిన అవసరం లేదు. కొన్ని అంగుళాలు ఈశాన్యాన్ని పెంచుకుంటే సరిపోతుంది.