భారత ప్రభుత్వం తాజాగా జనగణనలో కులగణన (Caste Census ) చేయనున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందిస్తూ.. ఇది చరిత్రాత్మక ముందడుగు అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా కేంద్రం ఈ తరహా కులగణన చేపట్టనుండటం ఒక పెద్ద నిర్ణయమని అన్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు పూర్తిగా జరగకపోవడం వల్ల వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద అందుబాటులో లేకపోయిందని ఆయన అన్నారు.
నిధుల కేటాయింపులు, బడ్జెట్ నిర్మాణం
ఈ కులగణన ద్వారా ప్రభుత్వానికి యథార్థ సామాజిక సమాచార భాండాగారం ఏర్పడనుందని, దీని ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు మరింత లక్ష్యబద్ధంగా అమలు చేయవచ్చని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పథకాలు, నిధుల కేటాయింపులు, బడ్జెట్ నిర్మాణం, రాజకీయ రిజర్వేషన్లు వంటి అంశాలన్నీ పటిష్టమైన డేటా ఆధారంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. సామాజిక న్యాయం సాధించడంలో ఇది కీలక ముందడుగని చెప్పారు.
పేద, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం
ఇది కేవలం గణాంకాల సమాహారమే కాదు, సమాజానికి సమాన అవకాశాలు కల్పించే దిశగా తీసుకున్న విధానపరమైన నిర్ణయం అని కిషన్ రెడ్డి తెలిపారు. పేద, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం కేంద్రం పనిచేస్తోందని, ఈ కులగణన దానికే భాగమని చెప్పారు. ప్రజల సహకారంతో ఈ గణన ప్రక్రియ విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : KTR : జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటానన్న కేటీఆర్