తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం మొదటిసారిగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ (Cabinet ) సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగినట్లుగా సమాచారం. తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం. ఈ సందర్భంగా ప్రతి మంత్రికి సంబంధిత శాఖలపై స్పష్టమైన దిశానిర్దేశాలు చేసే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం పథకంపై ముఖ్యంగా చర్చ జరగనుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు, స్కిల్స్ అభివృద్ధి చేసేలా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపుదిద్దనుంది. అంతేగాక, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా ఆలస్యమవుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం
అదే సమయంలో రైతు భరోసా పథకం అమలు, అలాగే యాసంగి పంటల పెండింగ్ నిధుల చెల్లింపు వంటి అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. రైతులకు పంట సాయంగా ఇచ్చే నిధులను వెంటనే విడుదల చేయాలన్న దిశగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్త మంత్రివర్గ సమావేశం కాబట్టి, సంక్షేమ పథకాల అమలుపైనా ప్రభుత్వ దృష్టి పెట్టనుంది. తాజా భేటీలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉండటంతో అందరి దృష్టి ఈ సమావేశంపై కేంద్రీకృతమైంది.
Read Also : Govt Schools : హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో గంజాయి రాయుళ్ల స్వైరవిహారం..