రానా దగ్గుబాటి – వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ సీజన్ 1కి కొనసాగింపుగా వచ్చిన సీజన్ 2 ప్రస్తుతం స్ట్రీమింగ్ లో ఉంది. సుపర్న్ వర్మ – కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా సాగుతుంది. మొదటి సీజన్ లో 10 ఎపిసోడ్స్ ఉండగా, రెండో సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. కుటుంబ సంబంధాల మధ్య ఆత్మీయత, అండర్‌వరల్డ్ ప్రపంచం మధ్య హింస, ప్రతీకారం, బ్లాక్ మెయిల్ వంటి అంశాలను మేళవిస్తూ కథనం నడిచింది. మొదటి మూడు ఎపిసోడ్స్ కాస్త నెమ్మదిగా సాగినా, తరువాత కథ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రానా (రానా దగ్గుబాటి), రౌఫ్ మీర్జా (అర్జున్ రామ్‌పాల్) మధ్య జరిగిన సంఘర్షణలే ఈ సీజన్ లో హైలైట్‌గా నిలిచాయి.

కథ నేపథ్యం: కుటుంబాన్ని కాపాడుకునే యుద్ధం
రానా నాయుడు (రానా) తన ఫ్యామిలీని సేఫ్ గా ఉంచాలనీ, ఆర్ధికంగా ఫ్యామిలీని సెటిల్ చేయాలని భావిస్తాడు. అందుకోసం అప్పటివరకూ చేస్తూ వచ్చిన పనులను మానేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ రానా నాయుడిని తిరిగి తనదారికి తెచ్చుకోవాలని ఓబీ మహాజన్ (రాజేశ్ జైష్) ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన కారణంగా జైలు నుంచి బయటికి వచ్చిన గ్యాంగ్ స్టర్ రౌఫ్ మీర్జా ( అర్జున్ రామ్ పాల్), తన కజిన్ ను చంపిన రానా నాయుడిపై ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం వెయిట్ చేస్తుంటాడు.
ఓబీ మహాజన్.. రానా నాయుడిని బ్లాక్ మెయిల్ ద్వారా తన దారికి తెచ్చుకోవడం కోసం, ఆయన భార్య మీదికి పోలీస్ ఆఫీసర్ నవీన్ జోషీని ఉసిగొల్పుతాడు. ఈ విషయం తెలియని రానా నాయుడు భార్య నైనా ( సుర్వీన్ చావ్లా) ఆయన ఆకర్షణలో పడుతుంది. డబ్బుకోసం నాగా నాయుడుతో కలిసి బ్యాంకు దొంగతనానికి పాల్పడిన తేజు, పోలీసులకు దొరికిపోతాడు. తల్లి పట్టించుకోని కారణంగా రానా నాయుడు కూతురు నిత్య, రేహాన్ తో కలిసి షికార్లు చేస్తూ ఉంటుంది.
విరాజ్ ఒబెరాయ్ కూతురు అలియా (కృతి కర్బందా)తో కలిసి క్రికెట్ కి సంబంధించిన బిజినెస్ చేయాలని రానా నాయుడు భావిస్తాడు. ఆమె తన పట్ల ఆకర్షితురాలైనా ఆయన పట్టించుకోడు. అలాంటి పరిస్థితుల్లోనే రేహాన్ ను .. అతని తండ్రిని రౌఫ్ హత్య చేస్తుంటే రానా నాయుడి కూతురు ‘నిత్య’ చూస్తుంది. దాంతో ఆమెను చంపాలని రౌఫ్ నిర్ణయించుకుంటాడు. భార్య.. కూతురు విషయాలు, అన్న జైల్లో ఉన్న సంగతి రానా నాయుడికి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనేది మిగతా కథ.
నిర్ధిష్టంగా తీర్చిన నెగిటివ్ అంశాలు
సీజన్ 1తో పోలిస్తే ఈసారి బూతు డైలాగ్స్, శృంగార సన్నివేశాలు కంట్రోల్ లో ఉన్నాయని చెప్పాలి. దాంతో, కథను సీరియస్‌గా అర్థం చేసుకునే అవకాశం పెరిగింది. మొదటి సీజన్‌లో పలు ట్రాక్‌లు అనాధిగా మిగిలిపోవడం వల్ల ప్రేక్షకులలో అసంతృప్తి ఏర్పడింది. కానీ రెండో సీజన్‌లో వాటిని గట్టి కథాక్రమంగా కొనసాగించారు. కొన్ని పాత్రలు మాత్రమే బలహీనంగా కనిపించినా, ముఖ్యమైన పాత్రలకు చక్కని స్థానం ఇచ్చారు. వెంకటేశ్ పాత్రకు హాస్యాన్ని జోడించటం వల్ల కొంత లైట్ మూమెంట్‌ను అందించారు. క్రైమ్, థ్రిల్లర్ కంటే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
నటీనటుల ప్రదర్శన – టెక్నికల్ వర్క్
రానా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మెచ్చుకోదగినవే. అతని పాత్రలో కనిపించే లోతైన భావోద్వేగాలు పాత్రకు బలాన్ని ఇచ్చాయి. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా విలక్షణ నటనను కనబరిచాడు. వెంకటేశ్ పాత్ర మాస్ – కామెడీ మధ్య బ్యాలెన్స్‌ను చూపించగా, కృతి కర్బందా గ్లామర్‌తో ఆకట్టుకుంది. OB మహాజన్, విరాజ్ ఒబెరాయ్ పాత్రలు మరింత బలంగా ఉంటే ఇంకాస్త ఇంపాక్ట్ ఉండేది. కెమెరామాన్ జాన్ స్కిమిద్ విజువల్స్ సినిమాటిక్ గా ఉండగా, నేపథ్య సంగీతం డార్క్ టోన్‌కు తగినట్టుగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ పరంగా కొన్ని చోట్ల వేగం తగ్గినట్టు అనిపించినా, మొత్తంగా సమతూకంగా ఉంది.
ముగింపు: రానా నాయుడు మరింత బలమైన అడుగు
సీజన్ 2లో యాక్షన్ – ఎమోషన్ మిళితంగా మంచి కథ అందించారు. మొదటి మూడు ఎపిసోడ్స్ నెమ్మదిగా సాగినా, ఆ తర్వాత శరవేగంగా కథ ముందుకు వెళ్లింది. ఫ్యామిలీ సెంటిమెంట్, ప్రతీకారం, వంచన, ప్రేమ – అన్నీ కలిపి బలమైన డార్క్ డ్రామా రూపొందించారు. బూతు సన్నివేశాలపై నియంత్రణ ఉండటం ముఖ్యమైన మార్పు. కొద్ది పాత్రలు బలహీనంగా కనిపించినా, రానా – అర్జున్ రాంపాల్ పోరు ఈ సీజన్‌ను నిలబెట్టాయి. ప్రేక్షకులకు ఇది గట్టిగా నచ్చే అవకాశం ఉంది.
Read also: Sushant Singh Rajput: ఈరోజు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 5వ వర్థంతి