విజయవాడ: అర్హత కలిగి తల్లికి వందనం (Talliki Vandanam) పథకం అందకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 15 వేల మేర లబ్ధి చేకూరుస్తూ తల్లికి వందనం పథకం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని వెల్లడించింది. తల్లికి వందనం (Talliki Vandanam) పథకం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడివిడిగా జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి, ఇంటర్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జులై 5వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. ప్రవేశాల వివరాలు వచ్చేందుకు కొంత సమయం పడుతున్నందున వీరికి తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత పాలకుల నిబంధనలే కొనసాగింపు
2025 26 విద్యా సంవత్సం ప్రామాణికంగా పథకాన్ని వర్తింపజేస్తుంది. అర్హుల నిబంధనలకు సంబంధించి గత ప్రభుత్వం అమలు చేసిన వాటినే కూటమి ప్రభుత్వం కొనసాగించింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో 12 వేలు మించకూడదు. రేషన్ కార్డు ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల్లోపు, మెట్ట 10 ఎకరాల్లోపు లేదా రెండూ కలిపి పది ఎకరాల్లోపు ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉంటే పథకం వర్తించదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది. విద్యార్థి డేటాబేస్లో ఉండి, తల్లి లేకపోతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మ్యాపింగ్ చేస్తారు.
75% హాజరుతోనే తల్లికి వందనం
విద్యార్థులు ఒకటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇది వర్తించదు. విద్యార్థి కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి. అర్హత ధ్రువీకరణ పూర్తయిన అనంతరం గ్రామ, వార్డు సచివాలయాల విభాగం, సంక్షేమ, ఆర్థిక శాఖలు కలిసి సమన్వయంతో నిధుల బదిలీ ప్రక్రియ అమలు చేస్తాయి. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మేరకు సమగ్ర శిక్షా అభియాన్ నోడల్ ఖాతా ద్వారా ఆయా పాఠశాలకు నేరుగా చెల్లిస్తారు. ఫీజు చెల్లింపు మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఆ మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తల్లికి వందనం కింద చెల్లిస్తారు. సామాజిక ఆడిట్ కోసం లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. అర్హత ఉండి ఎవరినైనా అనర్హులుగా తిరస్కరిస్తే గ్రామ, వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం 2 వేల రూపాయలు మినహాయించి మిగతా 13 వేలు జమ చేయనుంది.
Read also: TTD: తిరుమలలో20వేల నుండి లక్షదాటిన భక్తులు !