ఇండోర్‌కు చెందిన యువ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న వివరాలు భయానక అనుమానాలను కలిగిస్తున్నాయి. అతని భార్య సోనమ్ రఘువంశీ, వివాహం అనంతరం రోజుల్లోనే తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హత్య చేయాలని పథకం వేసినట్టు మేఘాలయ పోలీసులు నిర్ధారించారు. శాంతియుతంగా ఉన్న కుటుంబంలో ప్రేమ, వ్యభిచారం, కుట్రలు కలిసి జరిగిన ఈ కథలో శరీరాన్ని మాయం చేసి, నిజాన్ని దాచేయాలని ప్రయత్నించిన రోమాంచిత నాటకం నడిచింది.

ఫిబ్రవరిలోనే పథకం సిద్ధం
పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సోనమ్, రాజ్ కుష్వాహా కలిసి రాజా రఘువంశీని హత్య చేయాలని నిర్ణయించారు. మొదట సోనమ్ అదృశ్యమైందని నమ్మించే పథకాలను సిద్ధం చేశారు. నదిలో కొట్టుకుపోయిందని అనిపించడమో, లేక ఆమె స్థానంలో మరో అపరిచిత మహిళను హత్య చేసి, ఆ మృతదేహాన్ని సోనమ్‌దిగా నమ్మించి, నిజం బయటపడే వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని హంతకులు పథకం పన్నినట్టు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. కానీ అవన్నీ విఫలమవడంతో సోనమ్ తన ప్రణయ స్నేహితులైన రాజ్, ఆకాష్, విశాల్‌లతో కలిసి షిల్లాంగ్ వెళ్ళింది. అక్కడ నాంగ్రియాట్ ప్రాంతంలో ముందస్తు ప్లాన్ ప్రకారం నిందితులు రాజా రఘువంశీ హత్యను అమలు చేశారు.
మే 23: హత్య దారుణ రూపం
ఎస్పీ సయీమ్ వెల్లడించిన వివరాల ప్రకారం మే 23న మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:18 గంటల మధ్య వీరంతా కలిసి వైసాడాంగ్ జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ అసోంలో కొనుగోలు చేసిన కత్తితో రాజ్, ఆకాశ్, విశాల్ ముగ్గురూ సోనమ్ ఎదుటే రాజాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని లోయలో పడేశారు. “ఆకాష్ షర్ట్‌పై రక్తపు మరకలు ఉండటంతో, సోనమ్ తాను ధరించిన రెయిన్‌కోట్‌ను అతనికి ఇచ్చింది. తర్వాత ఆ రెయిన్‌కోట్‌కు కూడా రక్తం అంటడంతో ఆకాష్ దాన్ని పారేశాడు. సోనమ్, రాజా అద్దెకు తీసుకున్న టూ-వీలర్‌ను కూడా వారు ఒకచోట వదిలేశారు” అని ఎస్పీ వివరించారు. సోనమ్ అదృశ్యమైందని భావించిన సమయంలో పోలీసులు ఈ రెయిన్‌కోట్, టూ-వీలర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చాకచక్యంగా పరారీ ప్రణాళిక
హత్య అనంతరం రాజ్ కుష్వాహా విశాల్‌కు ఇచ్చిన బురఖాను సోనమ్‌కు అందించాడు. అది ధరించిన సోనమ్ పోలీస్ బజార్‌కు వెళ్లి, అక్కడి నుంచి టాక్సీలో గువాహటి చేరుకుంది. అక్కడి నుంచి బస్సులో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి(Siliguri), అక్కడి నుంచి బస్సుల్లో పాట్నా, ఆరా మీదుగా లక్నోకు ప్రయాణించింది. లక్నో నుంచి బస్సులో ఇండోర్ (Indoor) చేరుకుంది. ఇంతలో మేఘాలయ మీడియా ఒక టూర్ గైడ్‌ను ఇంటర్వ్యూ చేయగా అతను సోనమ్, రాజాలను మరో ముగ్గురు వ్యక్తులతో చూసినట్టు చెప్పాడు.
దర్యాప్తులో మోసాల జాలం
సిలిగురిలో ఎక్కడైనా ప్రత్యక్షమై తనను ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడాలని రాజ్ సోనమ్‌కు సూచించాడు. రాజా మృతదేహం మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల దొరకదని, పోలీసుల విచారణకు ఒకటి రెండు నెలలు పడుతుందని వారు భావించారు. ఈలోగా బాధితురాలిగా డ్రామా ఆడాలని సోనమ్ ప్లాన్ వేసింది. అయితే, జూన్ 8న సోనమ్ ఇండోర్ (Indoor) విడిచి వెళ్లినప్పుడు మేఘాలయ పోలీసులకు చెందిన రెండు బృందాలు సివిల్ దుస్తుల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకు చేరుకున్నారు. “యూపీలో ఆకాశ్‌ను మొదట అరెస్ట్ చేయడంతో రాజ్ కంగారుపడ్డాడు. వెంటనే సోనమ్‌కు ఫోన్ చేసి తాను కిడ్నాప్ గ్యాంగ్ నుంచి ఇప్పుడే తప్పించుకున్నానని కుటుంబ సభ్యులకు చెప్పమని సూచించాడు. ఈ విధంగా ఘాజీపూర్‌లో ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది” అని ఎస్పీ సయీమ్ తెలిపారు.
నిందితుల వాంగ్మూలాలు నమోదు – నేరం జరిగిన తీరును రీకనస్ట్రక్ట్ చేయనున్న పోలీసులు
“మేము వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నాము. వారిని ప్రశ్నిస్తున్నాం. మరిన్ని ఆధారాలు సేకరించి, నేరం జరిగిన తీరును రీకనస్ట్రక్ట్ చేస్తాం” అని సయీమ్ చెప్పారు. ఈ కేసులో నిర్దేశిత 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిందితులందరినీ ఈ నెల 11న ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
Read also: Uttar Pradesh: 6 ఏళ్ల చిన్నారిపై 75 ఏళ్ల వృద్ధుడి అరాచకం