New Delhi: మహిళ, పురుష సమానత్వం విషయంలో భారత్ అట్టడుగున 131వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 148 దేశాల్లో లింగ సమానత్వ స్థితిగతుల సమాచారంతో ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025’ను ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యూఇఎఫ్) గురువారం విడుదల చేసింది. 2024తో పోలిస్తే ఈ ఏడాదిలో భారత ర్యాంకింగ్ రెండు స్థానాలు దిగజారింది. గతేడాది 129వ స్థానంలో నిలిచిన భారత్ ఈసారి 131వ ర్యాంకుకు చేరింది. మహిళ, పురుషుల జనసంఖ్యకు సంబంధించిన ‘ప్యారిటీ స్కోర్’ విషయంలోనూ భారత్ అట్టడుగున ఉండిపోయింది. భారత్ కూడా 64.1 శాతం ‘సమానత్వస్కోర్’ వచ్చిందని డబ్ల్యూఐఎఫ్ వెల్లడించింది. వరుసగా 16వ సారి ఈ జాబితాలో తొలి స్థానంలో ఐర్లాండ్ నిలిచింది. 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వస్థానంలో నార్వే, 4వ స్థానంలో యూకే, 5వ స్థానంలో న్యూజి లాండ్ నిలిచాయి.

ఆర్థిక వ్యవస్థ పనితీరులో మెరుగుదల
భారతదేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు మునుపటి కంటే బాగా మెరుగుపడింది. దీంతో ఆర్థిక వ్యవ హారాల విభాగంలో అదనంగా 0.3 పాయింట్లను భారత్ సాధించింది. మహిళ, పురుషుల ఆర్థిక భాగస్వామ్యం పెరగడంతో అదనంగా 0.9 పాయింట్లతో ‘ఆర్ధిక భాగస్వామ్యం అవకాశాల’ కేటగిరీలో మొత్తం 40.7 శాతం ప్యారిటీ స్కోర్‌ను సాధించింది. భారత్‌లోని మహిళ, పురుషుల ఆదాయ అంచనాల తేడా స్కోర్ 28.6 శాతం నుంచి 29.9 శాతానికి పెరిగింది. భారత్‌లోని వివిధ ఉపాధి కార్యకలాపాల్లో మహిళ, పురుష కార్మికుల భాగస్వామ్యం అనేది గతేడాది స్థాయిలోనే 45.9 శాతంగా కొనసాగుతోంది. అయితే విద్యాపరమైన కేటగిరిలో భారత్‌కు అత్యధికంగా 97.1 శాతం సమానత్వ స్కోర్ వచ్చింది. దేశంలోని మహిళ, పురుష జనాభా నిష్పత్తి, మహిళ, పురుషుల ఆరోగ్యకర ఆయుర్దాయాల్లో పెరుగుదల ఏటా జన్మిస్తున్న ఆడ, మగ పిల్లలు వంటి విభాగాల్లో భారత్ సమానత్వస్కోరు మెరుగుపడింది. రాజకీయ సాధికారతపరంగా భారత పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం అనేది 14.7 శాతం నుంచి 13.8 శాతానికి తగ్గింది. 2023 నాటి స్థాయితో పోలిస్తే గత రెండేళ్లుగా ఈవిభాగంలో భారతదేశ ప్యారిటీ స్కోరు తగ్గుతూనే ఉంది.
మహిళల మంత్రి పదవుల్లో ప్రాతినిధ్యం తగ్గుదల
భారత ప్రభుత్వంలోని మంత్రి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం 6.5 శాతం నుంచి 5.6 శాతానికి డౌన్ అయింది. ఈ విభాగంలో ప్యారిటీ స్కోర్ 5.9 శాతంగా నమోదైంది. 2019లో ఈ విభాగంలో భారత్ అత్యధికంగా 30 శాతం ప్యారిటీ స్కోర్‌ను సాధించింది. ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025’లో అనూహ్యంగా బంగ్లాదేశ్ ర్యాంకింగ్ మెరుగుపడింది. రాజకీయ సాధికారత, ఆర్థిక భాగస్వామ్యం వంటి విభాగాల్లో దక్షిణాసియాలోనే అత్యంత మెరుగ్గా బంగ్లాదేశ్ రాణించింది. ఒకేసారి ఏకంగా 75 ర్యాంకులు జంప్ చేసి ప్రపంచంలో 24వ ర్యాంకుకు చేరింది. భారత్ పొరుగుదేశాలైన పాకిస్థాన్ 148, మాల్దీవులు 138, శ్రీలంక 130, నేపాల్ 125, భూటాన్ 119 స్థానాల్లో నిలిచాయి.
Read also: Odisha : ఒడిశాలో ప్రేమ పెళ్లికి 40 మందికి శిరోముండనం