తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాల ప్రజలకు శ్రీవారి దర్శనానికి తిరుపతి(Tirupathi)కి వెళ్లే రైలు సౌకర్యం లేకపోవడం అనేక సంవత్సరాలుగా ఎదురవుతున్న సమస్య. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషి ఫలంగా కరీంనగర్ నుండి తిరుపతి, తిరుపతి నుండి కరీంనగర్ వరకు ప్రత్యేక రైలు (Train Services) సర్వీసులు ప్రారంభమయ్యాయి. మొత్తం 8 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. నాలుగు రైళ్లు కరీంనగర్ నుండి తిరుపతికి, మరిన్ని నాలుగు తిరుపతి నుండి కరీంనగర్ కు నడవనున్నాయి.
జూలై 6 నుండి 27 వరకు ప్రత్యేక సర్వీసులు
రైల్వే శాఖ జూన్ 12న ఈ ప్రత్యేక రైళ్లపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రైళ్లు జూలై 6 నుండి జూలై 27 వరకు నడవనున్నాయి. ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరే రైలు, సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుతుంది. అలాగే, సోమవారం సాయంత్రం 5:30 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరిన రైలు, మంగళవారం ఉదయం 8:25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ప్రయాణికుల స్పందనను బట్టి ఈ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చే అవకాశముందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
కేంద్రం సహకారానికి ధన్యవాదాలు
ఈ రైలు సర్వీసుల ఏర్పాటు కోసం సహకరించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. పలుమార్లు రైల్వే శాఖను కోరిన ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రత్యేక రైలు సదుపాయాన్ని ఉత్తర తెలంగాణ ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్తులో ప్రజల స్పందన బాగుంటే, ఈ మార్గంపై రెగ్యులర్ రైలు సేవలు కూడా అందుబాటులోకి రావచ్చు.
Read Also : Donald Trump : భారత్ కు ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధం – ట్రంప్