తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై విచారణలు, రాజకీయ దుమారం మధ్యలో తెలంగాణ జనసమితి (టి.జె.ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణను ఎదుర్కోవడంలో ఎలాంటి తప్పులేదని అయన అన్నారు.

ప్రజాధనంపై ఖచ్చితమైన సమాధానం అవసరం
కోదండరాం వ్యాఖ్యానిస్తూ, లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరగడం సహజమని పేర్కొన్నారు. ప్రజా సొమ్ము ఖర్చు చేసినప్పుడు, కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కావడంపై కొందరు రాద్ధాంతం చేయడం సమంజసం కాదని ఆయన విమర్శించారు.
తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయి, రాష్ట్రానికి అప్పు మాత్రం మిగిలింది అని వ్యాఖ్యానించారు. కమిషన్ ముందు హాజరై వాస్తవాలు వెల్లడించడం కేసీఆర్ బాధ్యత అని ఆయన అన్నారు.
ప్రజల సమస్యలను వింటున్న ప్రస్తుత ప్రభుత్వం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను వింటోందని కోదండరాం ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో అలాంటి అవకాశం కూడా దొరకలేదని కోదండరాం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జన సమితి కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నగరంలోని మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి అంశాలలో పోరాటం కొనసాగించాలని సూచించారు.
Read also: Rain Alert: తెలంగాణకు నాలుగు రోజులు భారీ వర్ష సూచన