తెలంగాణ (Telangana) రాజకీయాల్లో విలక్షణమైన స్థానం సంపాదించుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెపోటుతో బాధపడుతున్న గోపినాథ్, మూడు రోజుల క్రితం అనగా జూన్ 5న గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన, జూన్ 8వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.

గోపినాథ్ మృతి చెందడం బాధాకరంగా ఉందన్నారు చంద్రబాబు. (Chandrababu) గుండెపోటు కారణంగా మూడు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని తెలిసిందన్నారు. కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న వ్యక్తి ఇలా చనిపోవడం దురదృష్టకరం అన్నారు. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు. అలానే గోపినాథ్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం
మాగంటి గోపినాథ్ రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. ఈసందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోపినాథ్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వత 2014 ఎన్నికల్లో గోపినాథ్ టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సంవత్సంర జరిగిన ఎన్నికల్లోనూ గోపినాథ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలానే 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వ్యక్తిగా నిలిచారు.
ప్రముఖుల సంతాపం
గోపినాథ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. గోపీనాథ్ తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలో మాగంటి గోపినాథ్ ప్రస్థానం ప్రజలకు అత్యంత గుర్తుండిపోయేలా ఉంది.
Read also: BRS : మాగంటి మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం..