ఇజ్రాయెల్ (Israel ) సైన్యం గాజా(Gaza )పై జరిపిన వరుస దాడుల్లో గత 24 గంటల్లో 95 మంది పాలస్తీనీయులు మృతిచెందారు. ఈ విషాదకర పరిణామాన్ని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ దాడుల్లో 440 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. గాజా ప్రజలు ఇప్పటికే తాగునీరు, ఆహారం, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాల కోసం తీవ్రంగా సతమతమవుతుండగా, ఈ దాడులు వారి పరిస్థితిని మరింత దయనీయంగా మార్చుతున్నాయి.
మూడు ప్రధాన పంపిణీ కేంద్రాల వద్ద కాల్పులు
ఈ క్రమంలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) మానవతా సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. గాజాలోని మూడు ప్రధాన పంపిణీ కేంద్రాల వద్ద కాల్పులు జరగడం వల్ల సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఓ పంపిణీ కేంద్రం వద్ద జరిగిన కాల్పుల్లో 27 మంది మృతిచెందినట్లు రెడ్ క్రాస్ ప్రకటించడంతో, సాయాన్ని నిలిపివేయడం తప్పకుండా అవసరమయ్యిందని GHF తెలిపింది.
అంతర్జాతీయ సమాజం ఈ ఘటనపై తీవ్ర ఆవేదన
ఇకపోతే అంతర్జాతీయ సమాజం ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మానవతా సహాయం అందించాల్సిన సమయంలో నిషేధాలు, దాడులు జరగడం శోచనీయం అని అనేక దేశాలు భావిస్తున్నాయి. యుద్ధ పరిస్థితుల్లో పౌరుల భద్రతను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇరువైపులా మానవతా విలువలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also : E-Lottery : నేడు రాజధాని రైతుల ప్లాట్లకు ఈ-లాటరీ