తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ సమయంలో రెవెన్యూ వ్యవస్థను స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడంతో, భూమి సంబంధిత సమస్యలు తీవ్రంగా మిగిలిపోయాయి. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది. రాష్ట్ర హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) సోమవారం అధికారులతో జరిగిన సమీక్షలో భూభారతి చట్టం అమలుపై వివరించారు. జూన్ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భూభారతి చట్టం కింద రెవెన్యూ సదస్సులు (Revenue Committees) నిర్వహించి, ప్రజల వద్దకే వెళ్లి వారి భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను పరిష్కరించడం
గతంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు లేనిపోని భూ వివాదాల్లో చిక్కుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలకు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు సంబంధిత అధికారులను సంప్రదించే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం ఉచితంగా, ఎలాంటి రుసుములు లేకుండా నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను పరిష్కరిస్తోంది. ఇప్పటికే మొదటి విడతగా నాలుగు మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 13 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, రెండో విడతలో 28 మండలాల్లో 42 వేల దరఖాస్తులు అందాయని తెలిపారు. అందిన దరఖాస్తుల్లో 60 శాతం సమస్యలకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో అందుబాటులోకి
రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందని, ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని మంత్రి పేర్కొన్నారు. గతంలో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన రెవెన్యూ సేవలు ఇప్పుడు గ్రామస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. కలెక్టర్లు మానవీయ దృష్టితో భూ సమస్యలను పరిష్కరించాలనీ, రెవెన్యూ సదస్సులు ప్రజలతో మమేకంగా, సహానుభూతితో వ్యవహరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
Read Also : Transgender : ట్రాన్స్‌జెండర్ విషయంలో కేరళ హైకోర్టు సంచలన తీర్పు