తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రైతుల భవితవ్యాన్ని మెరుగుపరచడానికి మరో ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి “గ్రామ గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ” (Seed Distribution)కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని ప్రకటిస్తూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల దిగుబడులను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
11 వేల గ్రామాల్లో ఈ కార్యక్రమం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రంలోని 11 వేల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 40 వేల మంది రైతులకు నాణ్యమైన విత్తన కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ విత్తనాల పంపిణీతో రైతులు ఖర్చును తగ్గించుకొని, ఉత్తమ దిగుబడి సాధించగలుగుతారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల ఎంపికను వ్యవసాయ విశ్వవిద్యాలయ నిపుణుల సూచనలతో ప్రభుత్వం చేసినట్లు సమాచారం.
ఈ కిట్లలో వరి, కంది, పెసర, మినుము, జొన్న వంటి పంటల విత్తనాలు
ఈ కిట్లలో ప్రధానంగా వరి, కంది, పెసర, మినుము, జొన్న వంటి పంటల విత్తనాలు ఉన్నాయి. వర్షాధారిత, పొడి భూములకు అనుకూలంగా ఉండే నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా సమాచారం కూడా అందజేస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రైతులకు భరోసానిచ్చే, వ్యవసాయాభివృద్ధికి దోహదపడే చక్కటి ప్రయత్నంగా మారనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Bangladesh Currency : బంగ్లా కొత్త కరెన్సీపై కొత్త చరిత్ర