ఉక్రెయిన్ (Ukraine ) తన వ్యూహాత్మక చర్యల్లో భాగంగా రష్యా(Russia)పై మరోసారి తీవ్రమైన డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో రష్యా వైమానిక స్థావరాలు లక్ష్యంగా మారాయి. అధికార వర్గాల ప్రకారం, దాదాపు 40కి పైగా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. యుద్ధంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదే కావడం గమనార్హం. ఇది రష్యా వైమానిక బలగాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
రష్యాకు చెందిన విమానాలు నాశనం
ఈ దాడుల్లో రష్యాకు చెందిన ఏ-50, టూ-95, టూ-22 M3 వంటి అధునాతన, వ్యూహాత్మక విలువగల విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం. ముఖ్యంగా ఏ-50 వంటి రాడార్ గుర్తింపులకు ఉపయోగించే విమానాల ధ్వంసం, రష్యా గగనతల పర్యవేక్షణ సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ దాడులకు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ కీలకంగా పాల్గొన్నట్లు సమాచారం.
సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం
ఈ విధ్వంసకర దాడుల కారణంగా సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఈ దాడులు యుద్ధ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ ఇటీవలి కాలంలో డ్రోన్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతి సాధించినట్లు కూడా ఈ దాడులు సూచిస్తున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై రష్యా అధికార ప్రతిస్పందన కోసం అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Read Also : GST : మే నెలలో రూ.2.01 లక్షల కోట్ల GST వసూళ్లు