షిరిడీ (Shirdi) సాయిబాబా ఆలయం ప్రాంగణంలో ఇటీవల దొరికిన విలువైన బంగారు గడియారం ప్రస్తుతం భక్తుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మే 21, 2025న షిరిడీలోని పవిత్రమైన ద్వారకామాయి మందిరంలో సాయిబాబా కూర్చొన్న రాయికి సమీపంలో భద్రతా సిబ్బందికి ఈ విలువైన గడియారం కనిపించింది. ఈ గడియారం ప్రత్యేకత ఏమిటంటే, దానిపై బ్రిటన్ యొక్క చారిత్రాత్మక చిహ్నంగా చెప్పుకోవచ్చిన క్వీన్ విక్టోరియా చిత్రం ముద్రించబడి ఉండగా, “విక్టోరియా ఎంప్రెస్” అనే పదాలు కూడా పొందుపరచబడి ఉన్నాయి. దీని విలువ మార్కెట్‌లో సుమారుగా రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ట్రస్ట్ స్పష్టీకరణ – వేలం వేయం
ఈ విషయంపై సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ CEO గోరక్ష్ గడిల్కర్ స్పందిస్తూ, ద్వారకామయిలో దొరికిన ఈ గడియారాన్ని వేలం వేయం. దాని యజమాని కోసం మేము మరో 8- 10 రోజులు వేచి చూస్తాం. వాచ్‌ను తీసుకోవడానికి ఎవరు రాకపోతే, దానిని సంస్థాన్ లాకర్లో భద్రంగా ఉంచుతాం. భవిష్యత్తులో యజమాని వస్తే అతను రుజువు సమర్పించిన తర్వాత గడియారాన్ని తిరిగి ఇస్తాం. ఆలయ ప్రాంగణంలో భక్తుల విలువైన వస్తువులు కనిపిస్తే వాటిని సంస్థాన్ లో జమ చేస్తాం. ఎవరూ ముందుకు రాకపోతే వాటిని సంస్థాన్ లాకర్ లో భద్రపరుస్తాం. ఆలయ ప్రాంగణంలో దొరికిన వస్తువులను సంస్థాన్ వేలం వేయదు. భక్తులు సాయిబాబాకు సమర్పించినందున విరాళాలు, హుండీలో వేసిన వస్తువులను మాత్రమే వేలం వేస్తుంది అని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ గోరక్ష్ గడిల్కర్ తెలిపారు.
సోషల్ మీడియాలో ఉత్కంఠ – వేలం వేయాలనే డిమాండ్
ఇంకొవైపు, ఈ బంగారు వాచ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది నెటిజన్లు, స్థానికులు వాచ్‌ను వేలం వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. షిరిడీకి చెందిన గ్రామస్థుడు ప్రమోద్ గోండ్కర్ స్పందించారు. సాయిబాబా సంస్థాన్ గడియారాన్ని పోగొట్టుకున్న భక్తుడిని తెలుసుకునేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే గడియారాన్ని తీసుకోవడానికి ఎవరూ రాకపోతే ట్రస్ట్ దానిని ఇతర క్లెయిమ్ చేయని వస్తువులతో పాటు వేలం వేయాలి. అలాగే వేలం వేసే అన్ని విలువైన వస్తువులను వివరిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. ఈ ప్రత్యేకమైన గడియారాన్ని వేలం వేస్తే దాదాపు రూ. 3లక్షలు-రూ.4 లక్షల వరకు పలుకుతుంది. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు అని అభిప్రాయపడ్డారు.
గడియారం దొరికిన నేపథ్యంలో ట్రస్ట్ చర్యలు
అయితే మే 21న ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు మహిళా భద్రతా గార్డులకు (రంజనా కుంభార్, రషీద్ షేక్) ద్వారకామాయిలోని సాయిబాబా కూర్చొన్న పవిత్ర రాయి దగ్గర రూ.2 లక్షల విలువైన బంగారు గడియారాన్ని గుర్తించారు. దానిపై విక్టోరియా రాణి చిత్రం ఉంది. అలాగే ‘విక్టోరియా ఎంప్రెస్’ అని రాసి ఉంది. వెంటనే భద్రతా సిబ్బంది దానిని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కు సమర్పించారు. ఆ తర్వాత ఈ వాచ్ ఎవరిదైతే వారు సరైన ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని ట్రస్ట్ భక్తులను కోరింది. అయితే, 10 రోజులైనా ఎవరూ ఈ గడియారం తమదేనని ముందుకు రాలేదు. దీంతో బంగారు వాచ్ ను వేలం వేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read also: Bayya Sunny: బయ్యా సన్నీ పాక్ టూర్‌పై కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ