ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు బంద్ (Theaters Bandh ) అంశం చుట్టూ జరుగుతున్న వివాదంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాత ‘దిల్’ రాజు (Dil Raju) ప్రతిస్పందించారు. పవన్ సినిమా హరిహర వీరమల్లు విడుదలకు ముందు నాలుగు మంది కుట్ర చేశారన్న ప్రచారం నేపథ్యంలో అల్లు అరవింద్, దిల్ రాజు ప్రత్యేకంగా స్పందించారు. తాము పవన్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, పవన్ వ్యాఖ్యలకు తాము గౌరవం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా పవన్‌కు ధన్యవాదాలు తెలిపే లేఖను విడుదల చేశారు.
పవన్ ఆలోచనలతో నేను ఏకీభవిస్తున్నాను – దిల్ రాజు
పవన్ కళ్యాణ్ థియేటర్లపై చేసిన వ్యాఖ్యలు చర్చకు తావిచ్చినవే కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు దిశానిర్దేశకంగా ఉన్నాయని ‘దిల్’ రాజు అన్నారు. ముఖ్యంగా థియేటర్లలో సాధారణ ప్రేక్షకులకు స్నాక్స్, కూల్‌డ్రింక్స్ ధరలు అందుబాటులో ఉండాలన్న పవన్ అభిప్రాయం ప్రశంసనీయం అని తెలిపారు. పవన్‌కు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అంశంపై పరిశ్రమలో ఉన్న అందరూ చర్చించి, సామూహికంగా ముందుకు సాగాలని సూచించారు.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు
తమ చిత్ర పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ, తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు కొనసాగుతాయని దిల్ రాజు వెల్లడించారు. తెలుగు సినిమా అభివృద్ధి కోసం నిర్మాతల మండలి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వంటి నాయకులు పరిశ్రమ సమస్యలపై స్పందించడం సంతోషకరమని, భవిష్యత్‌లో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Read Also : Kavitha New Party : కవిత ‘కొత్త పార్టీ’ ఖాయమా?