ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలకు సిద్ధమవుతున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నేడు ఉదయం నుంచి రాత్రివరకూ మొత్తం ఏడుగురు కీలక కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వివిధ అంశాలను చర్చించనున్నారని సమాచారం.
పోలవరం ప్రాజెక్టుకు నిధుల
ముఖ్యంగా కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వే & ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో మెరుగైన ఆర్థిక సాయం, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీ హబ్ స్థాపన, ఐటీ హబ్ అభివృద్ధి, ఏరో స్పేస్ పరిశ్రమలకు మద్దతు, రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటుపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఈ భేటీల ద్వారా రాష్ట్రానికి మరిన్ని కేంద్ర నిధులు, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల రాకకు దారితీసేలా చంద్రబాబు కృషి చేస్తున్నారు. కేంద్రంతో సమన్వయం పెంచుకుని అభివృద్ధికి ఊతమివ్వాలన్న లక్ష్యంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రానికి అనేక రంగాల్లో సహాయం ప్రకటించే అవకాశముందని సమాచారం. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చలు కొనసాగుతున్నాయి.