పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైనప్పటికీ, అంతర్జాతీయంగా దీని ప్రభావాలు విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనానే అసలైన గెలుపొందిన దేశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఈ పోరులో నిలవలేక కాల్పుల విరమణ కోసం అమెరికాను బతిమాలు కోవడం, ట్రంప్ సలహాతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం అంతర్జాతీయంగా మరికొన్ని కీలక పరిణామాలకు కారణమవుతోందన్న నివేదికలు వెలువడుతున్నాయి. భారత్-పాకిస్తాన్ (India-Pak) మధ్య నాలుగు రోజుల పాటు సాగిన యుద్ధంలో అంతిమ విజేత చైనాయే అన్న వాదన తెరపైకి వస్తోంది. దీనికి ప్రధాన కారణంగా ఈ యుద్దంలో చైనా పాకిస్తాన్ కు అందించిన సాయం వల్లే అని తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రయోగించిన చైనా యుద్ధ విమానాలను, మిస్సైళ్లనూ భారత్ కూల్చేసినట్లు మన రక్షణ వర్గాలు ఎప్పుడో ప్రకటించాయి. అయితే అంతర్జాతీయంగా మాత్రం చైనా తమ యుద్ద విమానాలను, మిస్లైళ్లనూ ప్రమోట్ చేసుకుంటోంది. వీటి వల్లే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పుకుంటోంది.

ఆయుధాల యుద్ధం – పశ్చిమం vs చైనా
భారత్-పాక్ (India-Pak) యుద్ధంలో చైనా పంపిన జే-10సీ ఫైటర్ జెట్లు, ఇతర క్షిపణుల్ని చైనా పంపింది. ఇప్పటివరకూ వీటిని తైవాన్ పై పోరులోనే వాడుతున్న చైనా తొలిసారిగా వీటిని భారత్ -పాక్ యుద్దంలో పరోక్షంగా పరీక్షించింది. పాకిస్తాన్ కు వీటిని ఇవ్వడం ద్వారా చైనా ఇలా వీటిని పరీక్షించింది. అంతే కాదు చైనా తాము పంపిన జే 10సీ ఫైటర్ జెట్లు తొలిసారి యుద్ధ ఫలితాలు సాధించారని అధికారిక మీడియా ప్రకటించింది. ఇది భవిష్యత్ యుద్దాలకు తమకు పనికొస్తుందని చెప్పుకుంటోంది. పాకిస్తాన్ కూల్చివేసినట్లు చెప్పిన కొన్ని భారతీయ జెట్లు ఫ్రాన్స్ తయారు చేశాయనే నివేదికలు చైనా గర్వాన్ని మరింత పెంచాయి. అలాగే భారతదేశం పశ్చిమ దేశాల నుండి కొనుగోళ్లను పెంచుతుండగా, పాకిస్తాన్ చైనా నుండి సైనిక కొనుగోళ్లను బాగా పెంచుతోంది. దీంతో కొంతమంది విశ్లేషకులు ఈ సంఘర్షణను పాశ్చాత్య, చైనా ఆయుధ సామర్థ్యాల మధ్య పరోక్ష ఘర్షణగా కూడా అభివర్ణిస్తున్నారు.
భారత వైఖరి – చైనా వాదనపై ఖండన
భారత్ తో యుద్ధంలో పాకిస్తాన్ చైనా తయారు చేసిన వైమానిక రక్షణ వ్యవస్థలు, దీర్ఘ-శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ పీఎల్-15 క్షిపణులను కూడా ఉపయోగించిందని ఆ దేశ భద్రతా అధికారులు చెప్తున్నారు. అయితే భారత్ మాత్రం ఈ వాదనను ఖండిస్తోంది.మరోవైపు తమ ఫైటర్ జెట్లు, మిస్సైళ్లు సక్సెస్ అయ్యాయని చైనా చేస్తున్న ప్రచారం వల్ల వీటికి డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.యుద్ధానికి వెళ్లకుండానే గెలవడం వాస్తవమైన వ్యూహాత్మక విజయం. ఆ ప్రయోజనం చైనా ఖాతాలోకి చేరిందన్న వాదనలు బలపడుతున్నాయి.
Read Also: Supreme court: సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై కీలక విచారణ