షోలాపూర్ టెక్స్టైల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షోలాపూర్ నగరంలోని అక్కల్కోట్ రోడ్ ఎంఐడీసీ (MIDC) పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ టెక్స్టైల్ (Textiles) ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సెంట్రల్ టెక్స్టైల్ మిల్స్ అనే ఈ ఫ్యాక్టరీ షోలాపురి ప్రఖ్యాతి గల చద్దర్లు, తువ్వాలు తయారీ కేంద్రంగా పేరుపొందింది. అయితే, ఈరోజు తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రారంభంలో చిన్నపాటి మంటలుగా కనిపించిన ఈ ప్రమాదం, క్రమంగా ఫ్యాక్టరీ మొత్తాన్ని చుట్టేసింది. పరిశ్రమ అంతటా మంటలు విస్తరించి, భారీగా అగ్నికీలలు ఎగిసిపడటంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
శవాలుగా మారిన ఎనిమిది మంది
ఈ మంటల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి సహా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారు — కంపెనీ యజమాని ఉస్మాన్ మన్సూరి (87), అనస్ మన్సూరి (24), సికా మన్సూరి (24), యూసుఫ్ మన్సూరి (1.5), అయేషా బగ్వాన్ (45), మెహతాబ్ బగ్వాన్ (51), హీనా బగ్వాన్ (35), సల్మాన్ బగ్వాన్ (18)గా గుర్తించారు. వీరిలో కొందరు పని కోసం మిల్లులో ఉన్నవారు కాగా, మరికొందరు కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. ఈ ఘటన కుటుంబాలపై తీరని విషాదాన్ని మిగిల్చింది. దాదాపు ఎనిమిది మంది సజీవదహనమవడమే కాకుండా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంటల అదుపులోకి రావడానికి 10 గంటల శ్రమ
మంటల తీవ్రత అత్యంత భయంకరంగా ఉండటంతో, వాటిని అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 10 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ ఆపరేషన్‌లో షోలాపూర్ అగ్నిమాపక శాఖ అధికారి రాకేశ్ సలుంఖే సహా మరో ఇద్దరు ఫైర్‌ఫైటర్లు గాయపడ్డారు. మంటలను ఆర్పే ప్రయత్నాల్లో వారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యం?
ఈ ఘటన మరోసారి పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలను జనంలో రేపుతోంది. షార్ట్ సర్క్యూట్ (Short circuit) వల్ల ఇంత భారీగా మంటలు చెలరేగడం, తక్షణమే అదుపులోకి రాకపోవడం చూస్తే, ఫ్యాక్టరీలో అగ్నిప్రమాద నివారణ వ్యవస్థలు సరిగా లేవన్నది స్పష్టమవుతోంది. సంబంధిత అధికారులు ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజల అభిప్రాయం. ముఖ్యంగా, ఆదివారం వంటి సెలవుదినాల్లో కూడా ఫ్యాక్టరీలు కార్యకలాపాలు కొనసాగించడం, భద్రతా చర్యలు పాటించకపోవడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి.
విషాదంలో షోలాపూర్ – దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
ఈ ఘటనపై షోలాపూర్ జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ సహా ఉన్నతాధికారులు స్పందించారు. పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, బాధ్యులపై చర్యలపై త్వరలో స్పష్టత వస్తుందని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనతో షోలాపూర్ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఫ్యాక్టరీ పరిసరాల్లోని ప్రజలు, బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read also: Abu Saiullah : లష్కరే తోయిబా ఉగ్రవాది అబు సైఫుల్లా హతం