గత నెల 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద చోటుచేసుకున్న ఉగ్ర దాడి దేశాన్ని విషాదంలో ముంచింది. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం “ఆపరేషన్ సిందూర్” అనే పేరుతో ప్రత్యేక దాడులకు శ్రీకారం చుట్టింది.

ఈ ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు పీఓకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్)తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు హతమయ్యారు. భారత సైన్యం అంచనా వేసిన సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో పాక్ సైనికుల సహకారంతో పని చేస్తున్న పలువురు ఉగ్ర ముఠాల నేతలు కూడా మృతి చెందారు.
పాక్ మిస్సైల్ ప్రతీకారం
ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ అనేక డ్రోన్లు, క్షిపణులను భారత సరిహద్దు ప్రాంతాలపై ప్రయోగించగా, భారత గగనతల రక్షణ వ్యవస్థలు పటిష్టంగా స్పందించాయి. ఆకాశ్, ఎస్ 400 వంటి మన గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టాయి. వాటిని ఎక్కడికక్కడ నేలమట్టం చేశాయి. ఈ క్రమంలో పాక్ మిస్సైల్స్, డ్రోన్లకు సంబంధించిన శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు భారీ ఎత్తున సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి.
భారత ఆర్మీ విడుదల చేసిన వీడియో.. నెటిజన్ల స్పందన
పాకిస్థాన్‌పై జరిపిన పలు దాడుల వీడియోలను భారత ఆర్మీ విడుదల చేసిన విషయం విదితమే. తాజాగా పాక్ క్షిపణులను ఎలా కూల్చారో తెలిసేలా వెస్ట్రన్ కమాండ్ ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అగ్ని గోడలా భారత ఆర్మీ శత్రుదేశపు మిస్సైల్స్‌ను నేలమట్టం చేసిందని పేర్కొంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.