భారతదేశ రాజధాని ఢిల్లీ మరోసారి వాయు కాలుష్య ప్రభావానికి లోనవుతోంది. ఇప్పటివరకు వర్షం కారణంగా కాలుష్యం తగ్గే సూచనలు ఉన్నప్పటికీ, విపరీతమైన గాలుల వల్ల దుమ్ము, ధూళి నగరాన్ని ముసిరాయి. ప్రజలు కళ్ల మంటలు, ఊపిరితిత్తుల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 298కు చేరడంతో ఇది “తీవ్రమైన కాలుష్య స్థాయి”గా పరిగణించబడుతోంది.

వాతావరణ మార్పులు, ఇసుక తుపానుల ప్రభావం
రాజస్థాన్ మీదుగా ఆవరించిన ఇసుక తుపాను ప్రభావంతోనే ఢిల్లీలో దుమ్ము, దూళి రేగుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం, గాలి నాణ్యతను గమనిస్తూ ఇంట్లోనే ఉండడం అవసరం. అటు సెంట్రల్ ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలో దుమ్ము ప్రభావం ఎక్కువగానే ఉంది. ఉదయం ఆరు గంటల నుంచే దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీస్తున్నాయి.
ప్రజలపై పడుతున్న ప్రభావం
ఈ పరిస్థితుల కారణంగా ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గాలిలోని విష పదార్ధాల ప్రభావానికి గురవుతున్నారు. అనేకమంది కళ్ల మంటలు, ఆకు దగ్గు, అలసట, శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పనులు లేకుండా బయటికి రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వర్షం కురిసినా కాలుష్య తీవ్రత తగ్గడం లేదు
ఢిల్లీ నగరంలో వర్షం కురిసినప్పటికీ కాలుష్య తీవ్రత పూర్తిగా తగ్గలేదు. సాధారణంగా వర్షం వల్ల గాలిలోని ధూళి కణాలు తగ్గుతాయి. అయితే ఈసారి వర్షం పరిమితంగా కురవడం వల్ల ప్రభావం తక్కువగా ఉంది. వర్షం తరువాత గాలి చల్లబడినప్పటికీ కాలుష్య ప్రభావం కొనసాగుతూనే ఉంది.
నిపుణుల సూచనలు, హెచ్చరికలు
ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దుమ్ము, ధూళి ప్రభావంతో ఢిల్లీలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలోను ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరికొన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా దుమ్ము, దూళితో కూడిన గాలులు, వానలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన వానలు పిడుగులు పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. ప్రజలు వీలైనంతమేరకు ఇంటి లోపలే ఉండాలని హెల్త్ అడ్వైజరీ జారీ అయ్యింది. అనవసరంగా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులకు గురికావొద్దంటూ సూచనలు చేస్తోంది.
Read also: Kedarnath: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్.. తప్పిన ప్రాణాపాయం!